ఉగ్రవాద పోషకులను సహించడానికి వీల్లేదు | PM Narendra Modi attends SCO Summit in Bishkek | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద పోషకులను సహించడానికి వీల్లేదు

Sep 2 2026 4:51 AM | Updated on Sep 2 2026 4:51 AM

PM Narendra Modi attends SCO Summit in Bishkek

ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దు  

సామూహికంగా పోరాడాలి.. నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి  

‘భద్రత, అనుసంధానం,  అవకాశాల’పై దృష్టి పెట్టాలి  

ఎస్సీఓ సదస్సులో మోదీ పిలుపు

ఇతర దేశాల సార్వబౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని స్పష్టీకరణ  

బిష్కెక్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుంటున్న దేశాలను సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాద మూకలను ఒక సాధనంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సహా వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. 

మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాద వ్యవస్థను పూర్తిగా పెకిలించివేయడానికి ఎస్సీఓ కూటమి ఐక్యంగా పని చేయాలని, నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని మోదీ సూచించారు. ఉగ్రవాదాన్ని ఒక విధానపరమైన సాధనంగా వాడుకుంటున్న దేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎవరికీ ఎప్పటికీ ‘వ్యూహాత్మక ఆస్తి’కాజాలదని స్పష్టంచేశారు. చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమాన్ని(బీఆర్‌ఐ) పరోక్షంగా ప్రస్తావించారు. ఎస్సీఓ చార్టర్‌ మౌలిక స్ఫూర్తి ప్రకారం.. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని స్పష్టంచేశారు. ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే..  

పరిష్కారం యుద్ధ భూమిలో కాదు  
‘‘ఉగ్రవాద భూతం మొత్తం మానవాళికి తీవ్ర సవాలుగా మారింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో మనం కేవలం చర్య–ప్రతిచర్య విధానానికే పరిమితం కాకూడదు. ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడం, నియామకాలు, ఉగ్రవాద భావజాల వ్యాప్తి, ముష్కరుల సురక్షిత స్థావరాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థను నిర్మూలించాలి. మనం ఒకే గళం వినిపించాలి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేయాలి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలకు తగిన బుద్ధి చెప్పాలి. నేడు పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఒక ప్రాంతంలో తలెత్తే సంఘర్షణ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఇది ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల గ్లోబల్‌ సౌత్‌ దేశాలు అత్యధికంగా నష్టపోతున్నాయి. ఉద్రిక్తతలు, సంఘర్షణలను యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. శాంతి, స్థిరత్వంలో కూడిన యురేషియా(యూరప్‌–ఆసియా) మన ఉమ్మడి ఆకాంక్ష. ఇది అప్గానిస్తాన్‌లోని శాంతి, స్థిరత్వంతో కూడా ముడిపడి ఉంది. అఫ్గానిస్తాన్‌ ప్రజల అభివృద్ధికి భారత్‌ తోడ్పాటు అందిస్తూ వస్తోంది. ఇకపైనా అందిస్తూనే ఉంటుంది.  

అన్ని ప్రయత్నాలకూ భారత్‌ మద్దతు  
దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. మా ర్కెట్లను అనుసంధానించే, వాణిజ్యాన్ని సులభతరం చేసే, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకూ భారత్‌ మద్దతు ఇస్తోంది. అయితే, అటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వబౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం కూడా అంతే అవసరం. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు ప్రధాన అంశాలపై మనం దృష్టి పెట్టాలి. ఈ మూడు మూలస్తంభాలను కేవలం ఆశయాలకే పరిమితం చేయకుండా.. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’’అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  

మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌ ఆత్మియ సంభాషణ  
ఎస్సీఓ సదస్సు సందర్భంగా అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. చాలాకాలం తర్వాత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ కలుసుకున్నారు. ముగ్గురు నేతలు వేదికపై కరచాలనం చేసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపు ఆత్మియంగా సంభాషించుకున్నారు. జిన్‌పింగ్, పుతిన్‌లతో మోదీ ఒకేసారి కరచాలనం చేశారు.  

పాక్‌ ప్రధాని కార్యాలయం వక్రబుద్ధి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కిర్గిజిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సహా 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలంతా కలిసి ఆనవాయితీ ప్రకారం గ్రూప్‌ ఫొటో దిగారు.

 ఈ ఫొటోలను ఆయాన దేశాల ప్రభుత్వాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాయి. పాకిస్తాన్‌ ప్రధాని కార్యాలయం ఈ ఫొటోలో నరేంద్ర మోదీని తొలగించి, తమ అధికారిక ఖాతాలో పోస్టుచేసింది. షెహబాజ్‌ షరీఫ్, పుతిన్, జిన్‌పింగ్‌లతోపాటు మోదీ కనిపించకుండా జాగ్రత్తపడింది. ఇందులో పుతిన్, జిన్‌పింగ్, షెహబాజ్‌ షరీఫ్‌ కనిపిస్తున్నారు. మోదీతోపాటు మరికొందరు దేశాధినేతలు లేరు. ఎస్సీఓ సదస్సు గ్రూప్‌ ఫొటోలను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇందులో పాక్‌ ప్రధాని షరీఫ్‌ సహా దేశాధినేతలందరూ కనిపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్‌ నీచ బుద్ధిపై భారతీయులు మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement