ఇస్లామాబాద్: పాకిస్థాన్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఏకాంతంగా ఉంచకూడదని వారిద్దరి మధ్య సమావేశానికి అనుమతివ్వాలని ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య పరస్పరం కలవడానికి వీలు కల్పించాలని తెలిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు.. అడియాలా జైలు అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత, ఆయనపై ఏకంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తోషాఖానా కేసులో ఇమ్రాన్‌తో పాటు ఆయన సతీమణి బుష్రాబీబీలకు కోర్టు వీరికి 17 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే ఒకే జైలులో ఉన్నప్పటికీ వారు పరస్పరం కలవడానికి కోర్టు అనుమతించలేదు. దీంతో దీనిపై ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ వ్యవస్థాపకుడిని ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్, బుష్రా బీబీ కుమార్తె ముబషరా ఖవార్ మనేకా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం జైలు నిబంధనల ప్రకారం ఖాన్ కుటుంబ సభ్యులను అతడిని కలుసుకోవడానికి అనుమతించాలని, అలాగే అతడికి, అతని కుమారులకు మధ్య ఫోన్ సంభాషణలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనే అంశంపై 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
కాగా అవినీతికి సంబంధించిన కేసులో దోషిగా తేలిన అనంతరం బుష్రాబీబీ 2024 జనవరి 31న తొలిసారిగా జైలు పాలయ్యారు. దాదాపు తొమ్మిది నెలల జైలు జీవితం తర్వాత, అదే సంవత్సరం అక్టోబర్ 24న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం మరో అవినీతి సంబంధిత కేసులో దోషిగా తేలడంతో, 2025 జనవరి 17న ఆమెను తిరిగి అరెస్టు చేశారు. అప్పటి నుండి అవినీతి సంబంధిత కేసులలో అదనపు శిక్షలు పొందడంతో, ఆమె అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్నారు.


