20 వేల పాత టైర్లు... వాటిని రీసైకిల్ చేయలేదు.. కాల్చలేదు, చెత్తకుప్పలో పడేయలేదు. ఏకంగా ఓ రహదారి కింద పాతిపెట్టారు.. వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న ఇంజినీరింగ్ ఆలోచన మాత్రం అద్భుతం. మంచుతో గడ్డకట్టే నేల, బురదగా మారే రోడ్ల సమస్యను పరిష్కరించడంతో పాటు.. పేరుకుపోతున్న వ్యర్థ టైర్లను ఉపయోగించుకోవడమే ఈ ప్రయోగం ఉద్దేశం.
1995లో అమెరికాలోని మైనే రాష్ట్రంలో నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రాజెక్టులో సుమారు 20,000 పాత టైర్లను ఒక రహదారి కింద పాతిపెట్టారు. ఈ ప్రయోగాన్ని పరిశోధనా పత్రంలో నమోదు చేశారు. రోడ్డు కింద ఉన్న మట్టి పొరలోకి మంచు లోతుగా చొచ్చుకుపోకుండా అడ్డుకునేందుకు టైర్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని ఇన్సులేషన్ పొరగా ఉపయోగించిన విధానాన్ని ఈ పరిశోధన వివరిస్తుంది. మైన్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గ్రావెల్ రోడ్లు ఉన్నాయి. శీతాకాలంలో మంచు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.
వేసవికాలంలో అది కరిగినప్పుడు.. భూమిలో నీరు అధికంగా నిలిచి మట్టి మెత్తగా.. అస్థిరంగా మారుతుంది. ఈ సమయంలో భారీ వాహనాలు ప్రయాణిస్తే రోడ్లపై లోతైన గుంతలు, రంధ్రాలు, బురద ఏర్పడి రహదారులు దాదాపు ప్రయాణించలేని స్థితికి చేరుకునేవి. అదే సమయంలో మైన్ రాష్ట్రంలో ప్రతి ఏడాది 10 లక్షలకు పైగా స్క్రాప్ టైర్లు పేరుకుపోయేవి. టైర్లు సహజంగా కుళ్లిపోవడానికి చాలా కాలం పడుతుంది. అవి ల్యాండ్‌ఫిల్‌లలో విలువైన స్థలాన్ని ఆక్రమించడంతో పాటు.. అగ్ని ప్రమాదాలు, కాలుష్యానికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాటిని సురక్షితంగా తిరిగి ఉపయోగించడానికి ఓ మార్గాని కనుగొన్నారు.
టైర్లతో రహదారిని నిర్మించాలనే ఆలోచన.. యూనివర్సిటీ ఆఫ్ మైన్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ డానా ఎన్. హంఫ్రీకు వచ్చింది. ఆయన బృందం మొత్తం టైర్లను అలాగే పాతిపెట్టకుండా వాటిని పెద్ద పరిమాణంలోని ముక్కలుగా కట్ చేశారు. సాధారణంగా ఈ టైర్ ముక్కల పరిమాణం 12 మిల్లీమీటర్ల నుంచి 76 మిల్లీమీటర్ల వరకు ఉండేది. ఆ టైర్ ముక్కలను రహదారి ఉపరితలం కింద మందమైన పొరగా అమర్చారు. దీంతో రెండు ప్రయోజనాలు కలిగాయి. నీరు సులభంగా బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ ఏర్పడింది. భూమిలోకి మంచు చొచ్చుకుపోయే ప్రభావం తగ్గింది.
ప్రతి ఏడాది లక్షలాది వ్యర్థ టైర్లు ల్యాండ్‌ఫిల్స్‌లో పేరుకుపోయి పర్యావరణ ముప్పుగా మారుతున్నాయి. వాటిని ఇలా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరిగింది. ఈ విధానాన్ని టీడీఏ (Tire-Derived Aggregate) అని పిలుస్తారు. నీటి మట్టానికి ఎత్తులో వీటిని అమర్చడం వల్ల తాగునీటి నాణ్యతపై కూడా ఎలాంటి దుష్ప్రభావం ఉండదని పర్యావరణ అధ్యయనాలు నిరూపించాయి.


