వాషింగ్టన్: ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోవడంతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇరాన్‌కు సహాయం చేస్తే ఊరుకోం అని తెలిపింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
జేడీవాన్స్ మీడియాతో మాట్లాడుతూ..ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు ట్రంప్ ప్రభుత్వం వద్ద ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన చర్యలతో పాటు రహస్యంగా ఒత్తిడి చేసేలా ప్లాన్ ఉంది. ఇరాన్‌పై చేపట్టబోయే తదుపరి చర్యలను బహిరంగంగా వెల్లడించదు. మా వద్ద ఇంకా చాలా అదనపు సాధనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అధ్యక్షుడు ఉపయోగిస్తారు.. మరికొన్నింటిని ఉపయోగించకపోవచ్చు. ఏది జరిగినా అది పరిశీలనలోనే ఉంది. ఆర్థిక ఒత్తిడి, సైనిక ఒత్తిడి, దౌత్యపరమైన ఒత్తిడి, రహస్య ఒత్తిడి.. ఇవన్నీ అధ్యక్షుడి వద్ద ఉన్న మార్గాల్లో భాగమే” అని వాన్స్ పేర్కొన్నారు.
ఇరాన్‌పై అమెరికా అనుసరిస్తున్న విధానం కేవలం సైనికపరమైన అంశాలకే పరిమితం కాదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇంధన సంక్షోభం తలెత్తకుండా చూడటం కూడా తమ కర్తవ్యాల్లో ఒకటని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడంతో పాటు చమురు, సహజవాయువు సరఫరా నిరంతరం కొనసాగేందుకు అమెరికా సైన్యం చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించారు.
ఇరాన్‌కు ఎలా ప్రతిస్పందించాలన్న విషయంలో వాషింగ్టన్ తనకు ఉన్న అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వాన్స్ చెప్పారు. అయితే రానున్న నెలల్లో ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
అయితే ఈ యుద్ధాన్ని ముగిసినట్లు ప్రకటించే అంశాన్ని ట్రంప్ ప్రైవేటుగా పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు అధికంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ట్రంప్ యుద్ధానికి ముగింపు ప్రకటించే అంశంపై ఆలోచిస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది.
మరోవైపు వాస్తవ పరిస్థితులేమో దీనికి భిన్నంగా ఉన్నాయి. అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక బలగాల మోహరింపును మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.


