‘పాక్‌ కంటే అడుగు ముందే ఉన్నాం’ | Indian womens cricket team all rounder Deepti Sharma on Pakistan team | Sakshi
Sakshi News home page

‘పాక్‌ కంటే అడుగు ముందే ఉన్నాం’

Sep 5 2026 1:11 AM | Updated on Sep 5 2026 1:11 AM

Indian womens cricket team all rounder Deepti Sharma on Pakistan team

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి వ్యాఖ్య 

శ్రీచరణిపై ప్రశంసల జల్లు  

దుబాయ్‌: దాయాది పాకిస్తాన్‌ జట్టు కంటే భారత బృందం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ పేర్కొంది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్నమహిళల ఆసియాకప్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా... శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీ చరిత్రలో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఇందులో పాకిస్తాన్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచింది. 

ఈ నేపథ్యంలో శుక్రవారం దీప్తి మాట్లాడుతూ... ‘పాకిస్తాన్‌తో పోరు అంటే పెద్దగా తేడా ఏమీ లేదు. ఆసియాకప్‌ అనే కాదు ఇతర మ్యాచ్‌లను తీసుకున్నా... పాకిస్తాన్‌తో పోటీల్లో మనం వారికంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్నాం. జట్టు మొత్తం బాగా ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు సమతూకంగా ఉంది. ఆ రోజు ఎవరి ఆట బాగా సాగుతుందో వారు మరింత మెరుగ్గా ఆడి జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మిగిలిన వారు సానుకూల దృక్పథంతో జట్టుకు సహకరిస్తారు. పాకిస్తాన్‌ బౌలింగ్‌ బృందం బలంగా ఉంది. మా వరకైతే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. శ్రీచరణి ఎంతో ప్రతిభావంతురాలు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. 

గత ఏడాది కాలంలో ఆమె నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంతిని గింగిరాలు తిప్పగలదు. ఆమె బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే. ప్రేమ రావత్‌ ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా... ఆమెలోనూ మంచి నైపుణ్యం ఉంది. అవకాశం వచ్చిన ప్రతీసారి జట్టుకు సహాయ పడేందుకు సిద్ధంగా ఉంటుంది’ అని దీప్తి వెల్లడించింది. నెట్స్‌తో పాటు మైదానంలో సీనియర్‌ బౌలర్‌గా వారికి తన వంతు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటానని దీప్తి పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement