source: X
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో నమీబియా అద్భుత ప్రదర్శనలతో అలరించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చిన ఆ జట్టు.. ఇవాళ జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ప్రొటీస్‌ను మరోసారి ఓడించినంత పని చేసింది.
ఆ జట్టు నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నమీబియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, తృటిలో (11 పరుగుల తేడాతో) ఓటమిపాలయ్యారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం మూడే వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఓ దశలో సౌతాఫ్రికాకు మరో పరాభవం తప్పదని అంతా భావించారు.
నమీబియా బ్యాటర్లు చేయాల్సిందంతా చేసినప్పటికీ, లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఛేదించలేకపోయారు. ఓపెనర్లు స్టీన్‌కంప్ (61 రిటైర్డ్ హర్ట్), జాన్ ఫ్రైలింక్ (72) మెరుపు అర్ద సెంచరీలతో అలరించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. కెప్టెన్ ఎరాస్మస్ (30 నాటౌట్), ట్రంపల్‌మన్ (21) ఓటమి ఖాయమైనా చివరి వరకు పోరాడారు.
ఈ ఓటమితో నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే ఫైనల్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబర్ 6న జరిగే తుది పోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి.
ప్రిటోరియస్ విధ్వంసకర సెంచరీ
అంతకుముందు ప్రిటోరియస్ విధ్వంసకర సెంచరీతో (53 బంతుల్లో 101; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ప్రిటోరియస్‌కు మరో ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88) తోడయ్యాడు. బ్రెవిస్ (3) నిరాశపర్చగా.. రూబిన్ హెర్మన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు.
చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో


