జింబాబ్వే, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
యువ ఆటగాళ్లు డేవిస్, పీక్‌కు చోటు
సిడ్నీ: వచ్చే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో పడింది. ఈ నెలలో జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) మంగళవారం జట్టును ప్రకటించింది. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న టాపార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు ఉద్వాసన పలికిన సెలక్షన్ కమిటీ... యువ ఆటగాళ్లపై నమ్మకముంచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లకు జట్టుకు దూరమైన మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే ఈ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌ను ఎంపిక చేయకపోవడం విశేషం.
ఈ నెల 15 నుంచి 20 మధ్య జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనున్న ఆ్రస్టేలియా జట్టు... ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24న డర్బన్‌లో తొలి వన్డే, 27న జొహన్నెస్‌బర్గ్‌లో రెండో వన్డే, 30న పోచెఫ్‌స్ట్రోమ్‌లో చివరి వన్డే జరగనున్నాయి. ఆసీస్ రెగ్యులర్ టెస్టు, వన్డే కెప్టెన్ కమిన్స్ జింబాబ్వేతో సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతడి గైర్హాజరీలో గతంలో పలుమార్లు జట్టును నడిపించిన మార్ష్ జట్టుకు సారథ్యం వహించడం ఖాయమే. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సైతం తాను అన్నీ మ్యాచ్‌లు ఆడటం అనుమానమే అని కమిన్స్ ఇప్పటికే వెల్లడించాడు. కమిన్స్‌తో పాటు మరో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్... దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.
ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సిరీస్‌ల్లో రాణించిన యువ ఆటగాళ్లు జోయల్ డేవిస్, ఒలీవర్ పీక్ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యంగ్ ప్లేయర్లకు అక్కడి పిచ్‌లపై అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. ‘వచ్చే ఏడాది ఇక్కడే వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ ఆరు మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి. స్థానిక పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఈ సిరీస్‌లో తోడ్పడతాయి’ అని సీఏ సెలెక్షన్ కమిటీ చీఫ్ జార్జ్ బెయిలీ అన్నాడు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్, జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కేరీ, కూపర్ కొనొల్లీ, జోయల్ డేవీస్, నాథన్ ఎలీస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇన్‌గ్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఒలీవర్ పీక్, మాథ్యూ రెన్‌షా, బిల్లీ స్టాన్‌లేక్, ఆడమ్ జంపా. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ (దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే).


