ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నుంచి మరో పేస్ సంచలనం వెలుగులోకి వచ్చాడు. ఎలాంటి జూనియర్ క్రికెట్ నేపథ్యం లేకపోయినా, మైదానంలో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. టోర్నీలో గంటకు 140 కి.మీకి పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన ఆ యువ బౌలరే 25 ఏళ్ల అన్షుమాన్ హుడా.
ఇటీవల ముగిసిన డీపీఎల్ మూడో సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్షుమాన్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 25 ఏళ్ల అన్షుమాన్ మొత్తంగా 21 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. తన జట్టు తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, శిఖర్ ధావన్ వంటి దిగ్గజ ఆటగాళ్ల ప్రశంసలు అందుకున్నాడు. అయితే అన్షుమాన్ ప్రయాణం మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది.
సాధారణంగా ఒక క్రికెటర్ మెరుగ్గా రాణించాలంటే చిన్నతనం నుంచే అకాడమీల్లో శిక్షణ పొందాలి లేదా అండర్-16, అండర్-19 మ్యాచ్‌లు ఆడాలి. కానీ అన్షుమన్ మాత్రం ఎలాంటి జానియర్ క్రికెట్ ఆడిన అనుభవం లేకుండానే బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు.
స్కేటింగ్ నుంచి క్రికెటర్ వరకు
చిన్నతనంలో క్రికెట్ పట్ల ఆసక్తి లేని అన్షుమాన్, రోలర్ స్కేటింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత స్కేటింగ్‌కు కూడా దూరమయ్యాడు. ప్రభుత్వ టీచరైన తన తల్లి కోరిక మేరకు ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో చేరాడు. ఇక్కడే తొలిసారి లెదర్ బాల్‌తో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అనంతరం ఢిల్లీ అండర్-23 జట్టు ట్రయల్స్‌కు రెండు సార్లు అతడు హాజరయ్యాడు. రెండు సార్లు కూడా సెలక్ట్ కాకపోవడంతో క్రికెట్ వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
ఉద్యోగం చేస్తూ క్రికెట్ వదిలేయాలనుకున్న అన్షుమాన్‌ను అతడి కోచ్ హరీష్ దాగర్ ప్రోత్సహించాడు. మరొక ఏడాది ఓపిక పట్టి, చివరి ప్రయత్నం చేయమని సూచించాడు. దీంతో ఒకవైపు ఐటీ ఉద్యోగం చేస్తూనే.. మైదానంలో తీవ్రంగా శ్రమించాడు. ఆ పట్టుదలే అతడిని డీపీఎల్‌కి ఎంపికయ్యేలా చేసింది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ అతడు సెలక్ట్ అయ్యాడు. తన డెబ్యూ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోపోయినప్పటికి.. ఈ ఏడాది మాత్రం దుమ్ములేపాడు. తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఆఖరిలో జరిగే ఐపీఎల్-2027 మినీ వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.
చదవండి: వివాదాలకు స్వస్తి.. మళ్లీ సొంత గూటికి స్టార్ ప్లేయర్


