PC: DPL Instagram/X
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందాడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ముందుకు వెళ్తూ బంతిని బౌండరీకి తరలించడమే అతడికి అలవాటు. ఇక సెహ్వాగ్ ట్రేడ్‌మార్క్ బ్యాక్ ఫుట్ పంచ్ షాట్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు.
అచ్చం తండ్రిలాగే..
వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తాజాగా ఈ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్ బాది అభిమానులను ఖుషీ చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో వెస్ట్ ఢిల్లీ లయన్స్- న్యూ ఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మనీశ్ సెహ్రావత్ సుడిగాలి ఇన్నింగ్స్
అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూ ఢిల్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (35), వికెట్ కీపర్ బ్యాటర్ కేశవ్ దలాల్ సింగ్ (36)లతో పాటు పార్థ్ బాలి (36*) రాణించగా.. లోయర్ ఆర్డర్‌లో మనీశ్ సెహ్రావత్ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 30*) ఆడాడు.
వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో తిశాంత్ డబ్లా, మయాంక్ గుసేన్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, మనన్ భరద్వాజ్ తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూ ఢిల్లీ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్ ఢిల్లీ ఓపెనర్లు క్రిష్ యాదవ్, ఆర్యవీర్ సెహ్వాగ్ వేగంగా ఆడారు.
దంచికొట్టిన ఓపెనర్లు
క్రిష్ యాదవ్ 32 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 45 పరుగులతో అదరగొట్టగా.. ఆర్యవీర్ సైతం దంచికొట్టాడు. పద్నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్‌తో బంతిని బౌండరీకి తరలించి కనువిందు చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వీరూ భాయ్ అభిమానులు.. ‘అచ్చం తండ్రిలాగే.. సెహ్వాగ్ బ్రాండ్ అలాంటిది మరి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెరుపు అర్ధ శతకాలు
ఇదిలా ఉంటే.. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్ రాణా (23 బంతుల్లో 50), కెప్టెన్ ఆయుశ్ దోసేజా (33 బంతుల్లో 64*) మెరుపు అర్ధ శతకాలు బాదగా.. వెస్ట్ ఢిల్లీ 201 పరుగులు సాధించింది. కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
కాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్‌లో సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీకి ఆడుతుండగా.. చిన్న కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు


