Photo Credit: BCCI Twitter
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికైన కొన్ని వారాలకే, తన వయసును తప్పుగా చెప్పాడనే ఆరోపణలపై బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది.
రోహిత్ యాదవ్ ఒక్కడే కాదు దాదాపు 62 మంది యువ క్రికెటర్లు వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలింది. ఈ 62 మంది క్రికెటర్ల వయసులో వ్యత్యాసాలున్నట్లు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. పత్రాలు, వయస్సు సంబంధిత వ్యత్యాసాల కారణంగా, 2026-27, 2027-28 సీజన్‌లలో ఏ టోర్నమెంట్‌కైనా నమోదు లేదా బదిలీ చేసిన 62 మంది క్రికెటర్లను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అనర్హులుగా ప్రకటించింది. వీరిలోనే ప్రస్తుతం రెండేళ్ల నిషేధం పడిన రోహిత్ యాదవ్ కూడా ఉన్నాడు.
దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆ 62 మంది క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో పాటు తాను కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక జాబితాలో రోహిత్ యాదవ్‌తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. అయితే బెంగాల్ అసోసియేషన్ రికార్డుల్లో రవి వయసు అసలుతో పోలిస్తే 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది.
రవితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా వయసుకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు క్యాబ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు క్యాబ్ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తప్పుడు వయసు పత్రాలను చూపించిన 62 మంది యువ ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది.
ఇక ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు తీసి, చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం.
బెంగాల్ అసోసియేషన్‌కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు. అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్‌గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్‌డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్‌డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.


