‘కంటెయినర్‌’లో నివసిస్తూ... | Indian athletes preparations for the Asian Games | Sakshi
Sakshi News home page

‘కంటెయినర్‌’లో నివసిస్తూ...

Sep 5 2026 12:59 AM | Updated on Sep 5 2026 12:59 AM

Indian athletes preparations for the Asian Games

ఆసియా క్రీడలకు భారత ఆటగాళ్ల సన్నాహాలు

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఎప్పటిలాగే పోటీల కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి తమ ఆటకు తోడు మరో విషయంలో వారు సన్నద్ధం కావాల్సి వస్తోంది. ఆశ్చర్యకరంగా గేమ్స్‌ సమయంలో తాము ఉండాల్సిన వసతికి సంబంధించిన సన్నాహకం ఇది! జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో ఈ సారి ప్రత్యేకంగా ‘క్రీడా గ్రామం’ ఏర్పాటు చేయడం లేదు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంటెయినర్లలోనే ఆటగాళ్లకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. 

ఆరడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ కంటెయినర్లలో ఉండటం అథ్లెట్లకు అంత సులువు కాదు. అయితే పోటీల కోసం వెళ్లినప్పుడు వాటిపై ఫిర్యాదు చేసి కూడా లాభం లేదు. అందుకే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కాస్త భిన్నంగా ఆలోచించింది. గేమ్‌ ప్రాక్టీస్‌ మాత్రమే కాకుండా వసతి విషయంలో కూడా ప్రాక్టీస్‌ చేయించడం అనివార్యంగా భావించింది. అందుకే ఆసియా క్రీడల తరహాలో ఉండే కంటెయినర్లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌)కు పంపించింది. ఆటగాళ్లు ఇందులోనే ఉండి తమ ప్రాక్టీస్‌ను సాగిస్తే జపాన్‌ వెళ్లాక ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు. 

ఆసియా క్రీడల్లోకి అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు సమస్య వస్తుంది కాబట్టి అలాంటి వాతావరణమే ఇక్కడా అందిస్తున్నారు! కొంత కాలం క్రితం ఆసియా క్రీడల ఏర్పాట్లను చూసేందుకు జపాన్‌కు వెళ్లిన భారత బృందం కంటెయినర్ల అవసరాన్ని గుర్తించింది. ఎన్‌ఐఎస్‌లో పురుషులు, మహిళల కోసం ఒక్కో కంటెయినర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ప్లేయర్లు ఉండే విధంగా రెండు బెడ్‌లు, రెండు ఏసీలతో పాటు చిన్నపాటి లాండ్రీ ఏరియా, కిచెన్‌ కూడా ఉన్నాయి. 

చిన్నపాటి సామాన్లు ఉంచుకునేందుకు వీలుగా నాలుగు క్యాబిన్‌లు ఉండగా, బెడ్‌ల కింది భాగం ఆటగాళ్ల కిట్‌లు ఉంచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎనిమిది మంది అథ్లెట్లు ఇందులో నివాసం ఉండి పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. షాట్‌పుటర్‌ తజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్, డిస్కస్‌ త్రోయర్‌ సీమా కాలిరామ్నా దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement