50 ఏళ్ల వయసులోనూ లక్ష్యంపై గురి
ఆసియా క్రీడలకు సిద్ధమైన భారత వెటరన్ స్కీట్ షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్
న్యూఢిల్లీ: భారత వెటరన్ షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్... ఆసియా క్రీడల్లో తొలి పతకం సాధించాలనే పట్టుదలతో సాధన చేస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పోటీపడిన తొలి భారత స్కీట్ షూటర్‌గా గుర్తింపు సాధించిన 50 ఏళ్ల మేరాజ్... ప్రస్తుతం ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నెల 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానుండగా... 12 మంది షాట్‌గన్ షూటర్ల బృందం ప్రస్తుతం ఢిల్లీలోని కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో సాధన చేస్తోంది. గతంలో రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేరాజ్... ముచ్చటగా మూడోసారి అయినా పతకం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు.
‘ప్రతీ ఒక్కరూ పతకం సాధించాలనే లక్ష్యంతోనే పోటీ పడతారు. అయితే ఎక్కువ అంచనాలు లేకుండా బరిలోకి దిగడమే మేలు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అంచనాలు పెరిగితే మనం కలల్లో విహరిస్తూ వాస్తవానికి దూరమవుతాం. ముందు చేయవల్సిన దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం’ అని మేరాజ్ అన్నాడు. 1994 నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న మేరాజ్ రెండు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. సెపె్టంబర్ 14 వరకు జాతీయ శిక్షణ శిబిరం కొనసాగనుండగా... దీని వల్ల షూటర్లకు ఎంతో మేలు జరుగుతుందని మేరాజ్ అన్నాడు.
‘ఆసియా క్రీడల కోసం బాగా సన్నద్ధమవుతున్నాం. హెడ్ కోచ్ అమరీందర్ సింగ్‌తో పాటు విదేశీ కోచ్ రిచార్డో ఫిలిపెల్లి, ఫిజియో థెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ ఇలా అందరూ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. దీని ఫలితాలు ఆసియా క్రీడల్లో తప్పక వస్తాయి. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) షూటర్‌లకు అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ సాధన తప్పక ఫలితాన్నిస్తుందనే నమ్మకముంది’ అని మేరాజ్ అన్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ పట్టణానికి చెందిన మేరాజ్ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నీల్లో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో 9వ స్థానంలో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 25వ స్థానంలో నిలిచాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో 28వ స్థానంలో, 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో 13వ స్థానంలో, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో 5వ స్థానంలో నిలిచాడు.
భారత భవిష్యత్తు బంగారం
మూడు దశాబ్దాలకు పైగా పోటీల్లో పాల్గొంటున్న మేరాజ్ ఖాన్... ఇటీవలి కాలంలో దేశంలో వచ్చిన మార్పులు మంచి భవిష్యత్తుకు సంకేతమని అన్నాడు. ఒకప్పుడు దేశంలో షూటింగ్‌కు పెద్దగా ఆదరణ దక్కేది కాదని... అలాంటిది ఇప్పుడు మౌలిక వసతుల నుంచి మొదలుకొని సంస్థాగతంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నాడు. ‘మేం షూటింగ్ ప్రారంభించినప్పుడు ఇవన్నీ లేవు. అందుకే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా సమయం పట్టింది. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రాథమిక స్థాయి నుంచే అన్నీ వనరులు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వం షూటర్ల కోసం సకల ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దేశంలో షూటింగ్‌కు ఆదరణ పెరిగింది. కేంద్ర క్రీడా శాఖ ఖేలో ఇండియా వంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ఫలితాలు రానున్న రోజుల్లో దేశమంతా చూస్తుంది. ఇలాంటి వ్యవస్థ వల్ల సహజ నైపుణ్యం ఉన్న చాంపియన్‌లు వెలుగులోకి వస్తారు. భవిష్యత్తులో భారత షూటింగ్ మరింత ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం’ అని మేరాజ్ వివరించాడు. ఇటీవల షాట్‌గన్ ప్రపంచకప్‌లో ట్రాప్ విభాగంలో పసిడి పతకం గెలిచిన యువ షూటర్ నీరూ ధండా కూడా ఖేలో ఇండియా క్రీడల ద్వారానే వెలుగులోకి వచ్చాడని మేరాజ్ గుర్తు చేసుకున్నాడు.


