అర్జున అవార్డుకు ఎంపికవడంపై హర్షం
సుదీర్ఘ కెరీర్ కోసం కసరత్తులు
ఒలింపిక్స్‌లో పతకమే జీవిత ధ్యేయం
డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత డెకాథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన తేజస్విన్ శంకర్... ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గడమే తన తదుపరి లక్ష్యం అని అంటున్నాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్‌లో కాంస్య పతకం గెలిచిన 27 ఏళ్ల తేజస్విన్... తాజాగా గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డెకథ్లాన్‌లో కాంస్యం నెగ్గాడు. దీంతో అతడి ప్రతిభను గుర్తించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ... ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది.
తన ప్రదర్శనకు గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందన్న తేజస్విన్... భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడంతో పాటు ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించడమే తన అంతిమ లక్ష్యమని వెల్లడించాడు. పది క్రీడాంశాల (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు) సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ అద్భుతాలు చేస్తున్నాడు. కామన్వెల్త్ కాంస్యం... అర్జున అవార్డుకు ఎంపికవడం... భవిష్యత్తు లక్ష్యాలపై తేజస్విన్ పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే...
నిరంతర సాధన
గతేడాది ఈ సమయంలో డెకాథ్లాన్‌లో 7,800 పాయింట్లు సాధించగలిగా. దాని తర్వాత మరింత మెరుగయ్యేందుకు తీవ్రంగా శ్రమించా... దీంతో నా ప్రదర్శనలో మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది పాల్గొన్న మూడు ఈవెంట్‌లలోనూ గతంలో కంటే మెరుగైన పాయింట్లు సాధించా. దాదాపు 200 పాయింట్లు మెరుగు పరుచుకున్నా. దీన్ని బట్టి సరైన దిశలోనే సాగుతున్న అని భావిస్తున్నా. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు ముందు వరకు మరో 300–400 పాయింట్లు మెరుగవ్వాలి... అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన పోటీని ఎదుర్కోగలం. అందుకే నిరంతర సాధన కొనసాగిస్తున్నా.
హైజంప్‌ను పక్కనపెట్టి...
చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. కానీ పాఠశాల స్థాయిలో నా ప్రతిభను గుర్తించిన కోచ్‌లు హైజంప్ వైపు ప్రోత్సహించారు. దీంతో అథ్లెటిక్స్‌కు మారాను. చాన్నాళ్ల పాటు హైజంప్‌పైనే దృష్టి పెట్టా... ఆ తర్వాత మరింత రాటుదేలి డెకాథ్లాన్‌ను ఎంచుకున్నా. గాస్గో కామన్వెల్త్ క్రీడల్లో డెకాథ్లాన్‌తో పాటు హైజంప్‌లో కూడా పోటీ పడ్డప్పటికీ గాయం కారణంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయా.
ఇప్పుడు ఆసియా క్రీడల్లో కూడా హైజంప్ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నా. కేవలం డెకాథ్లాన్‌పైనే దృష్టి పెడతా. ఆసియా క్రీడలకు మరో ఆరు వారాల సమయం ఉంది. ఆ లోపు నా బలహీనతలను గుర్తించి వాటిని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తా. ప్రత్యేకంగా హైజంప్‌పై దృష్టి పెట్టకపోయినా... డెకాథ్లాన్‌లోని పది క్రీడల్లో హైజంప్ ఓ భాగమే. ఇటీవలి కాలంలో సర్వేశ్ కుషారే హైజంప్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. నా రికార్డును అతడు బద్దలు కొట్టాడు. ఏదో ఒక రోజు నేను దాన్ని తిరగరేసేందుకు తప్పక ప్రయత్నిస్తా.
అదే మందు గుళిక
డెకాథ్లాన్‌లో భాగంగా రెండు రోజుల్లో 10 ఈవెంట్‌లలో పాల్గొనడం అంటే ఊహించినంత తేలిక కాదు. శక్తిని దాచి ఉంచుకోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే నిలకడ ముఖ్యం. అదే మనల్ని మరింత పెరుగు పరచగల ఏకైక మందు గుళిక. ప్రతి రోజూ చేసిన పనే చేస్తూ ఉంటే విసుగు వస్తుందంటారు కానీ... అందులో నుంచే మరింత మెరుగవ్వాలనే తపన పుడుతుంది. అదే మిమ్మల్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. నా ఫిట్‌నెస్ రహస్యం కూడా ఇదే. 2014 నుంచి నేను హైజంప్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఎప్పుడు విసుగు అనిపించలేదు. పుష్కర కాలం తర్వాత కూడా అదే మక్కువతో సాధన సాగిస్తున్నా. ప్రతి రోజు క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయడమే నా పని. దాని వల్లే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోగలుగుతున్నా.
అతిపెద్ద గౌరవం...
అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం పతకాలు సాధించాలని... ఆ ప్రదర్శనతో వచ్చిన గుర్తింపు ద్వారా దేశంలోని ప్రముఖులను కలవాలని చిన్నప్పుడు కలలు కనేవాడిని. ఇప్పుడది నిజమైంది. తాజాగా అర్జున అవార్డుకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోని అత్యున్నత క్రీడాకారులకు అందించే అవార్డు నాకు దక్కడం గర్వంగా ఉంది. అది కూడా దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనుండటం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ గుర్తింపు నాలో మరింత స్ఫూర్తి నింపుతోంది. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటి వరకు సాధించింది చాలా తక్కువ... భవ్యిత్తులో మరెంతో సాధించాల్సి ఉంది. ముఖ్యంగా ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు గెలవాలి.
సుదీర్ఘ కెరీర్ లక్ష్యంగా...
అథ్లెటిక్స్‌లో ఎక్కువ కాలం కొనసాగడమే అత్యంత కష్టమైన పని. సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను. ప్రస్తుత ఫిట్‌నెస్‌ను మరో 10–15 ఏళ్ల పాటు కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. 2036 ఒలింపిక్స్ వరకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అది నా అతిపెద్ద విజయంగా భావిస్తా. అంటే నా లక్ష్యం కేవలం పతకాలు సాధించడమే కాదు. దాంతో పాటు ఫిట్‌నెస్ కాపాడుకోవడం కూడా. సాధ్యమైనంత వరకు నిలకడైన ప్రదర్శన కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. దేశాంలో క్రీడా వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. మనం ఒక క్రీడా దేశంగా అభివృద్ధి సాధించాలంటే ప్రతీ పని ప్రభుత్వమే చేయాలని ఆశించకూడదు.
పసిడిపై గురి...
త్వరలో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో డెకాథ్లాన్‌లో రజత పతకం గెలిచాను. ఈసారి దాని రంగు మార్చాలనుకుంటున్నా. ఆసియా చాంపియన్‌షిప్స్ (2023, 2025)లోనూ పతకాలు గెలిచాను. కానీ పసిడి పతకం ఇంకా బాకీ ఉంది. దాన్ని జపాన్‌లో తప్పక సాధిస్తా. అయితే కామన్వెల్త్ క్రీడల కంటే ఏషియన్ గేమ్స్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. 8000 పాయింట్లకు మించి ప్రదర్శన కనబరిచే అథ్లెట్‌లు చాలా మంది పోటీలో ఉంటారు. గతేడాది అత్యుత్తమంగా 7,666 పాయింట్లు నమోదు చేశాను. తాజగా కామన్వెల్త్ క్రీడల్లో 7,976 పాయింట్లు సాధించగలిగా... వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధిస్తాననే నమ్మకం ఉంది.


