ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు
అభిషేక్‌శర్మ, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్
నిషిన్: స్థాయికి తగ్గ ఆటతీరుతో అదరగొట్టిన భారత టి20 క్రికెట్ జట్టు... వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా... ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. దీంతో ఏషియన్ గేమ్స్ మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ స్వర్ణాలు కైవసం చేసుకున్నట్లు అయింది. శనివారం తుదిపోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు 19 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో కదంతొక్కారు. బ్యాటింగ్‌కు కష్టతరమైన పిచ్‌పై అభిõÙక్ ఆరంభంలో దంచికొట్టగా... తిలక్ వర్మ తనదైన శైలిలో ‘ఫినిషింగ్ టచ్’ ఇచ్చాడు. మధ్య ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల రాక కష్టమైనా... ఆఖర్లో తిలక్ దంచికొట్టడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది.
శివమ్ దూబే (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (21; 2 ఫోర్లు), వైభవ్ సూర్యవంశీ (15; 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. హసన్ నవాజ్ (51 బంతుల్లో 96; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పాక్‌కు పరాజయం తప్పలేదు.
4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వైభవ్ సూర్యవంశీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన హసన్ నవాజ్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు... పాకిస్తాన్ ప్లేయర్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. శ్రీలంక జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి)ఉస్మాన్ (బి) సయీమ్ 15; అభిõÙక్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) అరాఫత్ 61; సామ్సన్ (సి) అరాఫత్ (బి) అహ్మద్ డానియల్ 2; శ్రేయస్ (సి) సాహిబ్‌జాదా (బి) అబ్రార్ 21; ఇషాన్ (బి) అరాఫత్ 20; తిలక్ (నాటౌట్) 51; దూబే (సి) మాజ్ (బి) అహ్మద్ డానియల్ 27; అక్షర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–28, 2–51, 3–93, 4–128, 5–133, 6–195. బౌలింగ్: సయీమ్ అయూబ్ 4–0–47–1; సాద్ మసూద్ 3–0–33–0; అహ్మద్ డానియల్ 3–0–43–2; అరాఫత్ మిన్హాస్ 3–0–35–2;అబ్రార్ 4–0–29–1; సూఫియాన్ 3–0–33–0.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: సాహిబ్‌జాదా ఫర్హాన్ (సి) అక్షర్ (బి) సుందర్ 10; మాజ్ (సి) సుందర్ (బి) అక్షర్ 23; ఉస్మాన్ (సి) దూబే (బి) అక్షర్ 3; హసన్ నవాజ్ (సి) సామ్సన్ (బి) దూబే 96; సయీమ్ అయూబ్ (సి) సుందర్ (బి) దూబే 29; అబ్దుల్ సమద్ (సి) తిలక్ (బి) సుందర్ 9; సాద్ మసూద్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–33, 2–36, 3–39, 4–126, 5–162, 6–192. బౌలింగ్: బుమ్రా 4–0–33–0; అక్షర్ పటేల్ 4–0–29–2; సుందర్ 4–0–29–2; రవి బిష్ణోయ్ 3–0–44–0; అభిషేక్ 2–0–23–0; శివమ్ దూబే 3–0–33–2.


