చరిత్ర సృష్టించానికి రెడీ అవుతున్న పాకిస్థాన్ వ్యోమగామి | Pakistani astronaut to make history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించానికి రెడీ అవుతున్న పాకిస్థాన్ వ్యోమగామి

Nov 23 2026 8:17 PM | Updated on Nov 23 2026 8:29 PM

Pakistani astronaut to make history

చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అరుదైన అవకాశాన్ని పాకిస్థాన్‌కు చెందిన వ్యోమగామి దక్కించుకున్నారు. చైనా చేపట్టనున్న షెంఝౌ-24 అంతరిక్ష యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే చైనా మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా ఆ దేశ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి విదేశీ వ్యోమగామిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ (China Manned Space Agency) ఈ యాత్ర కోసం పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యోమగామిని ఎంపిక చేసినట్లు అల్‌జజీరా వెల్లడించింది. చైనా ప్రభుత్వ మీడియా కథనాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొంది. అయితే ఎంపికైన వ్యోమగామి పేరును, ఆయన అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన తేదీని అధికారులు ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది చివరిలోగా యాత్ర జరిగే అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియలో ఇద్దరు పైలట్లు
చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు పాకిస్థాన్ పైలట్లు జీషాన్ అలీ, ఖుర్రం దావూద్ అభ్యర్థులుగా శిక్షణ పొందారు. బీజింగ్‌లోని చైనా వ్యోమగాముల పరిశోధన, శిక్షణ కేంద్రంలో వీరు కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకున్నారు.

పాకిస్థాన్ వ్యోమగాములను ఎంపిక చేసి, చైనా అంతరిక్ష కేంద్ర యాత్రలకు సిద్ధం చేసేందుకు 2025 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష నౌకలో విధులు నిర్వహించేందుకు అవసరమైన ప్రాయోగిక శిక్షణతోపాటు చైనా భాషలోనూ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఎంపికైన వ్యోమగామి అంతరిక్ష నౌకలో పేలోడ్ స్పెషలిస్ట్‌గా వ్యవహరించనున్నారు. అంటే అంతరిక్ష యాత్రలో శాస్త్రీయ పరికరాలు, పరిశోధనలకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చైనా మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంలో విదేశీ వ్యోమగామికి అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.

చంద్రుడిపైకి పాకిస్థాన్ జిన్నా-1 రోవర్
చైనా, పాకిస్థాన్ అంతరిక్ష సహకారం మానవ సహిత యాత్రలకే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌కు చెందిన తొలి చంద్ర అన్వేషణ వాహనం జిన్నా-1ను కూడా చైనా జాతీయ అంతరిక్ష సంస్థ చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతోంది. 35 కిలోల బరువున్న ఈ రోవర్‌లో ప్రత్యేక శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. చంద్రుడిపై ప్లాస్మా ప్రవర్తన, రేడియేషన్ స్థాయులు, నేల స్వభావాన్ని అధ్యయనం చేయడం వీటి లక్ష్యం.

చైనా, పాకిస్థాన్ మధ్య వాణిజ్య, దౌత్య, వ్యూహాత్మక సంబంధాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. చైనా పాకిస్థాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండటంతోపాటు కీలకమైన విదేశీ పెట్టుబడిదారుగానూ ఉంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష సహకారం మరింత విస్తరిస్తోంది.

2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు
అంతరిక్ష పరిశోధనలో అమెరికాతో పోటీపడే లక్ష్యంతో చైనా తన కార్యక్రమాలను విస్తరిస్తోంది. 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు చంద్రుడిపై అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటుపైనా చైనా, అమెరికా, రష్యా దృష్టి సారించాయి. 2030 చివరి నాటికి చంద్రుడిపై అణు రియాక్టర్ అభివృద్ధి చేయాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లక్ష్యంగా పెట్టుకోగా, చైనాతో కలిసి పనిచేస్తున్న రష్యా 2036ను గడువుగా నిర్ణయించుకుంది.

ఈ రియాక్టర్ల ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై ఏర్పాటు చేసే స్థావరాలకు విద్యుత్ అందించవచ్చు. చంద్రుడి బిలాల్లోని గడ్డకట్టిన నీటిని వెలికితీసి తాగునీరు, పీల్చేందుకు అవసరమైన గాలి, రాకెట్ ఇంధనం తయారీకి ఉపయోగించుకునే అవకాశముంది. షెంఝౌ-24 యాత్రతో ప్రారంభం కానున్న విదేశీ వ్యోమగాముల భాగస్వామ్యం చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక పరిణామంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement