వైభవంగా ముగింపు వేడుకలు.. పతాకధారిగా నీరూ ధండా | Neeru Dhanda Carries-Indian-Flag-Asian Games 2026 Closing Ceremony | Sakshi
Sakshi News home page

Asian Games 2026: వైభవంగా ముగింపు వేడుకలు.. పతాకధారిగా నీరూ ధండా

Oct 4 2026 3:31 PM | Updated on Oct 4 2026 4:11 PM

Neeru Dhanda Carries-Indian-Flag-Asian Games 2026 Closing Ceremony

రెండు వారాల పాటు క్రీడా ప్రియులను అలరించిన ఆసియా గేమ్స్ ఆదివారంతో  ముగిశాయి. ఈ నేపథ్యంలో జపాన్‌లో నగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలు జరిగాయి. అనంతరం "ఒకే ఆసియా" అనే సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ, ఐచి-నగోయా 2026 నుంచి ఖతార్‌లో జరగబోయే తదుపరి క్రీడల కోసం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) పతాకాన్ని అధికారికంగా దోహా 2030కి అప్పగించారు. 

ఈసారి క్రీడల్లో 85 పతకాలు సాధించిన భారత్ ఖాతాలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలున్నాయి. 2023 ఆసియా గేమ్స్‌లో 106 పతకాలు సాధించి సెంచరీ మార్క్‌ను దాటిన భారత్ జపాన్‌లో మాత్రం ఆ ఫీట్‌కు 15 పతకాల దూరంలోనే ఆగిపోయింది. అయితే పతకాల పట్టికలో మాత్రం తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక భారత్ తరఫున పతాకధారిగా నీరూ ధండా వ్యవహరించింది. ఆసియా గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన నీరు ధండాకు భారత ఒలింపిక్ అసోసియేషన్ అరుదైన గౌరవాన్ని అందించింది. 

తన పోటీలు ముగిసిన తర్వాత భారతదేశానికి చేరుకున్న నీరూ ధండా ముగింపు వేడుకల్లో పతకాధారిగా భారత బృందాన్ని ముందుండి నడిపించేందుకు శనివారమే తిరిగి జపాన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకల్లో నీరూ ధండా భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించారు.

ఇక ఆసియా క్రీడల చరిత్రలో వ్యక్తిగత ట్రాప్ షూటింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా నీరూ ధండా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈసారి పోటీల్లో నీరూ రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. మహిళల వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన నీరూ ధండా ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ (కైనన్ చెనాయ్‌తో కలిసి) స్వర్ణం గెలిచింది. ఇక మహిళల టీమ్ ట్రాప్ (మనీషా కీర్‌, ఆషిమా అహ్లావత్‌లతో కలిసి) రజత పతకం సాధించింది. 

అయితే ఆసియా గేమ్స్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు  ఆమె తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడి, ఆసుపత్రిలో చేరింది. అయితే జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ, నీరసంతో బాధపడుతూనే జపాన్‌కు వచ్చిన నీరూ ధండా మూడు పతకాలతో సత్తా చాటి దేశానికి గర్వకారణంగా నిలిచింది.

ఇదీ చదవండి: చెల‌రేగిన ముకేశ్ కుమార్‌.. రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ క‌ప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement