మొత్తం 85 పతకాలతో ముగించిన భారత బృందం
చివరి రోజు ఆర్చరీలో కుంకుమ్, రెజ్లింగ్‌లో అమన్, గోల్ఫ్‌లో ప్రణవికి స్వర్ణం
పసిడి గెలిచిన పురుషుల క్రికెట్, హాకీ జట్లు
నేటితో ఆసియా క్రీడలకు తెర
ఆసియా క్రీడల్లో భారత బృందం అంచనాలను అందుకోలేపోయింది. గత క్రీడల్లో సాధించిన 106 పతకాలకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత బృందం నాటికంటే 21 పతకాలు తక్కువగా సాధించింది. స్వర్ణాల సంఖ్య కూడా తగ్గినా... ఓవరాల్‌గా నాలుగో స్థానం నిలబెట్టుకుంటుందా లేక మరో స్థానం తగ్గుతుందా అనేది నేడు తేలనుంది. అయితే ఈ క్రీడల్లో తొలి 11 రోజుల పాటు 6 స్వర్ణాలకే పరిమితమై బాగా వెనుకబడినట్లు అనిపించిన దశలో ఒక్కసారిగా పుంజుకొని వరుస పతకాలు గెలుచుకోవడంతో భారత్‌కు ఊరట దక్కింది. చివరి 3 రోజుల్లోనే మన ఖాతాలో 15 స్వర్ణాలు చేరడం విశేషం.
భారత బృందం బరిలోకి దిగిన ఆఖరి రోజు శనివారం కూడా 5 స్వర్ణ పతకాల సంబరాన్ని అందించింది. మహిళల ఆర్చరీ రికర్వ్‌లో కుంకుమ్ మొహద్ చారిత్రాత్మక గోల్డ్ గెలుచుకోగా, రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్, గోల్ఫ్‌లో ప్రణవి బంగారు ఆనందం పంచారు. వీటికి తోడు ఊహించినట్లుగానే క్రికెట్, హాకీ పురుషుల జట్లు పసిడి పతకాలను గెలుచుకున్నాయి. మరో 2 రజతాలు, 2 కాంస్యాలతో మన ఆటకు 9 పతకాలతో ముగింపు లభించింది.
హాకీలో ఐదోసారి...
ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల జట్టు ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. గత ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణం గెలిచిన మన టీమ్ దానిని నిలబెట్టుకోవడంలో తొలిసారి సఫలమైంది. ఫైనల్లో భారత్ 5–1 గోల్స్ తేడాతో మలేసియాను చిత్తు చేసింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 57వ నిమిషాల్లో), జుగ్‌రాజ్ సింగ్ (23వ నిమిషంలో), హార్దిక్ సింగ్ (42వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (54వ నిమిషంలో) గోల్స్ సాధించగా... మలేసియా తరఫున షెలో సిల్వరస్ (14వ నిమిషంలో) ఏకైక గోల్ కొట్టాడు.
కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఇది వరుసగా రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, టీమ్‌లో అందరికంటే సీనియర్ ప్లేయర్ అయిన మన్‌ప్రీత్ సింగ్ మూడోసారి స్వర్ణం నెగ్గిన జట్టులో భాగంగా ఉండటం విశేషం. భారత్ ఆసియా క్రీడల్లో 1966, 1998, 2014, 2023లలో స్వర్ణాలు సాధించింది. తాజా విజయంతో మన టీమ్ 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది. గత రెండు ఒలింపిక్ క్రీడల్లో భారత్ వరుసగా కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి రూ.11 లక్షలు చొప్పున, సహాయక సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ. 5.50 లక్షల చొప్పున అందించనుంది.


