మూడో వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు.. సిరీస్‌ ఎగరేసుకుపోయిన ఇంగ్లండ్ | Ben Duckett Slams Century As England Thrash Australia To Clinch ODI Series | Sakshi
Sakshi News home page

మూడో వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు.. సిరీస్‌ ఎగరేసుకుపోయిన ఇంగ్లండ్

Nov 18 2026 7:31 PM | Updated on Nov 18 2026 7:37 PM

Ben Duckett Slams Century As England Thrash Australia To Clinch ODI Series

హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 97 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో 328 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. 

ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. కేవలం 115 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 133 పరుగులు చేశాడు. అతడితో పాటు విల్ జాక్స్ (59 పరుగులు), టామ్ బాంటన్ (44 పరుగులు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ నాలుగు, మాట్ రెన్‌షా మూడు వికెట్లు సాధించాడు.

329 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 46.5 ఓవర్లలో 231 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ రెన్షా (55 పరుగులు) అర్ధశతకంతో పోరాడినప్పటికీ మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఇంగ్లండ్ పేసర్‌ సోనీ బేకర్ 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. 

అతడితో పాటు స్పిన్నర్ లియామ్ డాసెన్ మూడు వికెట్లు సాధించాడు. కాగా సూపర్ సెంచరీతో మెరిసిన డకెట్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టామ్ బాంటన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: BAN vs SA: లిట్టన్ దాస్ సరికొత్త ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement