భారత పురుషుల, మహిళల హాకీ జట్లు
నేటి నుంచి జూనియర్ ఆసియాకప్
మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. శుక్రవారం నుంచి చైనా వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్‌గా పోటీకి సిద్ధమయ్యాయి. పురుషుల అండర్–21 జట్టు ఇప్పటికి రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఆసియా విజేతగా నిలవగా... మహిళల జట్టు వరుసగా మూడోసారి కప్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. పురుషుల విభాగంలో 1988 నుంచి జూనియర్ ఆసియాకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు పది టోర్నమెంట్‌లో జరిగాయి.
అందులో ఐదింట (2004, 2008, 2015, 2023, 2024లో) ట్రోఫీ నెగ్గిన భారత్... మరో రెండుసార్లు (1996, 2000) రన్నరప్‌గా నిలిచింది. దాయాది పాకిస్తాన్ మూడుసార్లు టైటిల్ నెగ్గి... ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. గత మూడు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన భారత పురుషుల జట్టుకు డిఫెండర్ అన్‌మోల్ ఎక్కా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పూల్ ‘ఎ’లో భాగంగా శనివారం జరగనున్న తమ తొలి పోరులో ఇండోనేసియాతో తలపడనున్న భారత్... ఆ తర్వాత సెప్టెంబర్ 6న జపాన్, 8న దక్షిణ కొరియా, 9న చైనీస్ తైపీతో అమీతుమీ తేల్చుకోనుంది.
‘హ్యాట్రిక్’పై అమ్మాయిల గురి
గత రెండు పర్యాయాలు ట్రోఫీ గెలుచుకున్న భారత అండర్–21 మహిళల జట్టుకు మిడ్‌ఫీల్డర్ శైలిమా చాను సారథ్యం వహిస్తోంది. టిమ్ వైట్ కోచింగ్‌లో రాటుదేలిన అమ్మాయిలు... ఇటీవలి కాలంలో ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం జట్లపై మెరుగైన ప్రదర్శన కనబర్చారు.
శనివారం తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడనున్న భారత్... సెప్టెంబర్ 6న మలేసియా, 8న జపాన్, 9న చైనాతో ఆడనుంది. ‘కొరియాతో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాం. తొలి మ్యాచ్ నుంచే చాంపియన్ ఆటతీరును కొనసాగిస్తాం. దీని కోసం గత కొన్ని రోజులుగా బెంగళూరులో ప్రత్యేకంగా సాధన చేశాం. ఇక్కడి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నా... మైదానంలో మెరుగైన ప్రదర్శన కనబర్చడంపైనే జట్టు దృష్టి ఉంది’ అని కోచ్ వైట్ పేర్కొన్నాడు.


