విజయాల వేటకు వేళాయె | Harmanpreet Singh-led India to kick off Hockey World Cup quest 15 aug 2026 | Sakshi
Sakshi News home page

విజయాల వేటకు వేళాయె

Aug 15 2026 6:22 AM | Updated on Aug 15 2026 6:22 AM

Harmanpreet Singh-led India to kick off Hockey World Cup quest 15 aug 2026

నేటి నుంచి ప్రపంచకప్‌ హాకీ టోర్నీ

వేల్స్‌తో భారత్‌ తొలి పోరు

సాయంత్రం గం. 4:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అమ్‌స్టెల్విన్‌ (నెదర్లాండ్స్‌): ఐదు దశాబ్దాల పతక నిరీక్షణకు తెర దించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు మరోసారి ప్రపంచకప్‌ సమరానికి సిద్ధమైంది. నేడు మొదలయ్యే 16వ ప్రపంచకప్‌ హాకీ టోర్నీ తొలి లీగ్‌ మ్యాచ్‌లో వేల్స్‌ జట్టుతో భారత జట్టు తలపడనుంది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో టీమిండియా భారీ విజయంతో బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. 

గత రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకాలతో మెరిసిన భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌లో మాత్రం నిరాశపరుస్తోంది. 1975లో ఏకైకసారి ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించిన భారత జట్టు ఆ తర్వాత మరోసారి ఈ మెగా టోరీ్నలో కనీసం సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ‘ప్రపంచకప్‌లో పతకం సాధించాలన్న ఒత్తిడి మాపై లేదు. పతకం గెలవడం మా బాధ్యత’ అని హర్మన్‌ప్రీత్‌ వ్యాఖ్యానించాడు. ఈసారి తొలి దశ లీగ్‌ మ్యాచ్‌ల పాయింట్లను రెండో దశ మ్యాచ్‌లకు ఫార్వర్డ్‌ చేయనున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారింది.

 వేల్స్‌ జట్టుపై సాధ్యమైనన్ని గోల్స్‌ సాధించి భారీ తేడాతో గెలవాలని భారత్‌ భావిస్తోంది. 417 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు హార్దిక్‌ సింగ్‌ మిడ్‌ఫీల్డ్‌లో... అభిషేక్, మన్‌దీప్‌ ఫార్వర్డ్‌ శ్రేణిలో మెరిపించేందుకు రెడీగా ఉన్నారు. వేల్స్‌తో మ్యాచ్‌ అనంతరం భారత జట్టు 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్తాన్‌తో ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో చైనా జట్టుతో తలపడుతుంది. 1974లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు ఆ తర్వాత మరోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement