రాజస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహిపాల్ లామ్రోర్‌కు ఊహించని అవకాశం వచ్చింది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు సర్రే జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఈ ఆర్సీబీ మాజీ ఆల్‌రౌండర్ ఆదివారం ఇంగ్లండ్‌కు చేరుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో మహిపాల్ లామ్రోర్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘ఏ క్రికెటర్‌కైనా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడటం అనేది గొప్ప అవకాశం. సీనియర్ ఆటగాళ్లతో కలిసి సర్రేకు ఆడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా’’ అని 26 ఏళ్ల లామ్రోర్ పేర్కొన్నాడు.
కాగా సర్రే జట్టు.. మిడిలార్డర్‌లో ఆడగల, లెఫ్టార్మ్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల బ్యాటర్ కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే సర్రే మెన్స్ క్రికెట్ డైరెక్టర్ అలెక్ స్టెవర్ట్ మహిపాల్ లామ్రోర్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
కాగా మహిపాల్ లామ్రోర్ 63 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి.. 3836 పరుగులు సాధించాడు. ఇందులో పది శతకాలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దేశీ సీజన్ 2024-25లో లామ్రోర్ ఉత్తరాఖండ్‌పై ట్రిపుల్ సెంచరీ కూడా బాదాడు.
ఇదిలా ఉంటే.. డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో సర్రే ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి కాగా.. ఇంకా ఆరు మిగిలి ఉన్నాయి. ఆగష్టు 20న ది ఓవల్ వేదికగా నాటింగ్‌హామ్‌షైర్‌తో మ్యాచ్‌తో తాజా సైకిల్‌ను సర్రే మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఊహించని రీతిలో లామ్రోర్‌కు అవకాశం రావడం విశేషం. కాగా టీమిండియా క్రికెటర్ రాహుల్ చహర్ ఇప్పటికే సర్రే జట్టుకు ఆడుతున్నాడు.


