ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర గాయమైనా.. అదృష్టం వల్లే తాను బతికి బయటపడ్డాడని పేర్కొన్నాడు. కాగా తన కౌంటీ జట్టు డర్హమ్‌కు చెందిన అకాడమీ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు.
బంతి బలంగా ముఖానికి తగలడంతో స్టోక్స్ నొప్పితో విలవిల్లాడాడు. ఈ ఘటనలో అతడి జైగోమాటిక్ ఎముక (cheekbone) విరిగిపోయింది. దీంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ స్టోక్స్ వచ్చే నెలల నుంచి కౌంటీ జట్టు తరఫున బిజీ కానున్నాడు.
బతికి ఉన్నానంటే అది అదృష్టమే
ఈ సందర్భంగా ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడుతూ.. ‘‘ప్రమాదకర ఘటన. పరిస్థితి చేజారిపోయిందనుకున్నా. నిజం చెప్పాలంటే క్షణకాలంలో అంతా జరిగిపోయింది. తల పక్కకు తిప్పడంలో కొంచెం ఆలస్యం చేసినా.. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు.
నా ముఖానికి శస్త్ర చికిత్స జరిగింది. చీక్‌బోన్ విరిగిపోయింది. నిజానికి బతికి ఉన్నానంటే అది అదృష్టమనే చెప్పాలి. ఇందుకు దేవుడికి కృతజ్ఞుడిగా ఉంటాను. దాదాపు నెలరోజుల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టగలననే నమ్మకం వచ్చింది.
భయాకన అనుభవం
డర్హమ్ తరపున ఆట మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా అదొక భయాకన అనుభవం. ఇప్పుడు అంతా సర్దుకుంది’’ అని బెన్ స్టోక్స్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. కాగా కెప్టెన్‌గా గత కొంతకాలంగా స్టోక్స్ వైఫల్యాలు చవిచూశాడు. ముఖ్యంగా అతడి సారథ్యంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర పరాభవం ఎదుర్కొంది.
ఆతిథ్య ఆసీస్ చేతిలో 4-1తో ఇంగ్లండ్ ఓడిపోయింది. అయితే, మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు గెలవడంతో అదృష్టవశాత్తూ వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. కాగా జూన్ 4 నుంచి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే టెస్టు సిరీస్‌తో మళ్లీ ఇంగ్లండ్ తరఫున స్టోక్స్ పునరాగమనం చేసే అవకాశం ఉంది.


