సిగ్గెందుకు?.. అతడిపై వేటు వేయండి: సెహ్వాగ్‌ | There is no shame in accepting mistake: Sehwag Slams KKR For Green | Sakshi
Sakshi News home page

సిగ్గెందుకు?.. అతడిపై వేటు వేయండి: సెహ్వాగ్‌

Apr 15 2026 3:43 PM | Updated on Apr 15 2026 5:15 PM

There is no shame in accepting mistake: Sehwag Slams KKR For Green

కేకేఆర్‌ కెప్టెన్‌ రహానే, సెహ్వాగ్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ విమర్శల వర్షం కురిపించాడు. చేసిన తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పనిలేదని.. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలని సూచించాడు. ఐపీఎల్‌-2026లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కేకేఆర్‌ ఇంత వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు.

పాతిక కోట్లు కుమ్మరించి
దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావించి పాతిక కోట్లు కుమ్మరించి కొనుక్కున్న కామెరాన్‌ గ్రీన్‌ వల్ల కేకేఆర్‌కు లాభం లేకుండా పోయింది. వెన్నునొప్పి కారణంగా ఆరంభ మ్యాచ్‌లలో అతడు బౌలింగ్‌ చేయలేకపోయాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు.

ఇక ఇప్పుడు బౌలింగ్‌ చేస్తున్నా గ్రీన్‌ (Cameron Green) ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. జట్టుకు అతడు భారంగా మారాడు. ఈ నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ గ్రీన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు నుంచి అతడిని తప్పించి వేరే ఆటగాడికి చోటు ఇవ్వాలని కేకేఆర్‌ నాయకత్వ బృందానికి సూచించాడు.

తప్పు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు?
‘‘మీ దగ్గర చాలా డబ్బు ఉన్నపుడు ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు. కామెరాన్‌ గ్రీన్‌ వంటి ఆటగాడి కోసం రూ. 25 కోట్లకు పైగా వెచ్చించినపుడు అతడు మీకు ఖరీదైన ఆస్తిగా మారాడు. మీరు అతడిని తుదిజట్టులో ఆడిస్తుంటే ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.

ఒకవేళ అతడిని తుదిజట్టు నుంచి తప్పిస్తే.. కోట్లు పెట్టి కొని అలాంటి ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం ఏమిటనే ప్రశ్నలు, విమర్శలు వస్తాయి. అయితే, చేసిన తప్పు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు?.. అవును.. తప్పు జరిగిపోయింది అని అంగీకరించండి.

వేటు వేయండి
కామెరాన్‌ గ్రీన్‌ను తప్పించి వేరే ఆటగాడికి తుదిజట్టులో చోటు ఇవ్వండి. బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా అతడి వల్ల ఏమాత్రం ఉపయోగం లేనపుడు ఇంకా కొనసాగించడం ఎందుకు? అతడు ఉన్నందువల్ల జట్టుకు ఒరిగేదేమీ లేదు అనుకుంటే.. కూర్పుకు తగినట్లు వేరొకరిని తీసుకోండి’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ వేదికగా పేర్కొన్నాడు.

కాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌.. ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరఫున ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో 56 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ విఫలమవుతున్న అతడు ఒక్క వికెట్‌ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మంగళవారం తలపడ్డ కేకేఆర్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో భాగంగా ఏప్రిల్‌ 17న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌ వేదిక.

చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement