సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా.. | CRPF Complains to Railways Over Shocking Election Train Delays | Sakshi
Sakshi News home page

సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా..

Jun 10 2026 8:09 AM | Updated on Jun 10 2026 8:57 AM

CRPF Complains to Railways Over Shocking Election Train Delays

న్యూఢిల్లీ: దేశ రక్షణలో, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే భద్రతా దళాలకు రైల్వే ప్రయాణంలో నరకయాతన ఎదురైంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాము ప్రయాణించిన ఎన్నికల ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా, కనీస వసతులు లేక, సకాలంలో ఆహారం అందక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రైల్వే బోర్డుకు ఘాటుగా లేఖ రాశారు.

25 గంటల ఆలస్యం.. సాయంత్రం ఐదింటికి టిఫిన్
అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల కోసం మొత్తం 230 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, అందులో దాదాపు 200 రైళ్లు తీవ్ర జాప్యంతో నడిచాయి. 150కి పైగా రైళ్లు 10 నుండి 15 గంటలు ఆలస్యంగా నడవగా, మరో 50 రైళ్లు ఏకంగా 20 నుండి 25 గంటల ఆలస్యంతో గమ్యస్థానాలకు చేరాయి. ఈ ఘోర జాప్యం వల్ల జవాన్ల భోజన ఏర్పాట్లు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఉదయం తినాల్సిన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా జవాన్లకు సాయంత్రం 5 గంటల సమయంలో అందిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైళ్ల రాకపోకల సమయంపై స్పష్టత లేకపోవడంతో ఐఆర్‌సీటీసీ సైతం సకాలంలో ఆహారం అందించలేకపోయింది.

కిక్కిరిసిన బోగీలు.. నిలవడానికీ లేని చోటు
రైళ్ల ఆలస్యమే కాకుండా, రైల్వే శాఖ కేటాయించిన బోగీల సంఖ్య కూడా జవాన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిబంధనల ప్రకారం ప్రతి ఎన్నికల ప్రత్యేక రైలుకు 24 బోగీలు కేటాయించాలని సీఆర్‌పీఎఫ్ డిమాండ్ చేసింది. అయితే, రైల్వే శాఖ కేవలం 19 నుండి 20 బోగీలను మాత్రమే సమకూర్చింది. 10 నుండి 11 కంపెనీల జవాన్లు, వారి భారీ లగేజీ, ఇతర సామగ్రిని ఈ పరిమిత బోగీలలో సర్దడం అసాధ్యంగా మారింది.

అపరిశుభ్రత.. మహిళా సిబ్బందికి తప్పని అవస్థలు
దీనికి తోడు ప్రయాణంలో కనీస అవసరాలైన నీటి సరఫరా, బోగీల శుభ్రతను రైల్వే శాఖ పూర్తిగా విస్మరించింది. రైలు కాలపట్టిక (ఇటినెరరీ) ప్రకారం నిర్దేశిత స్టేషన్లలో బోగీలను శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక చోట్ల ఆ పనులు చేయలేదు. ఫలితంగా బోగీలు అపరిశుభ్రంగా మారి, దుర్వాసనతో జవాన్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది ఈ అపరిశుభ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన సీఆర్‌పీఎఫ్, తిరుగు ప్రయాణంలోనైనా మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరగా.. దీనిపై స్పందించిన రైల్వే బోర్డు అధికారులు, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం

Advertisement
 
Advertisement
Advertisement