పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను ఉద్దేశించి ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పీఎస్‌ఎల్‌ను పోలుస్తున్న వారికి అతడు చురకలు అంటించాడు. ఐపీఎల్‌లో అమ్ముడుపోని వాళ్లు మాత్రమే పీఎస్‌ఎల్ వైపు చూస్తున్నారంటూ పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరువు తీశాడు.
ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్ ప్రకటిస్తూ పీసీబీ చేతులు కాల్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ తెలిసీ ఇలా చేయడం వల్ల రేటింగ్ రాక పీఎస్‌ఎల్ అభాసుపాలవుతోంది. ఇక ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌ల ప్రసార హక్కుల విలువ పీఎస్‌ఎల్ నాలుగు సీజన్లకు సమానంగా ఉందంటే పరిస్థితి ఎంత ఘోరంగా అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోలుస్తూ
ఇలాంటి తరుణంలో పాక్ మీడియా, మాజీ క్రికెటర్లు కొందరు, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోలుస్తూ త్వరలోనే తామే నంబర్ వన్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఈ సీజన్‌లో పీఎస్‌ఎల్‌ను వదిలి ఐపీఎల్‌లో చేరారు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీ ఇదే బాటలో నడవగా.. అతడిపై పీసీబీ రెండేళ్ల నిషేధం విధించింది.
అలాంటి వాళ్లే ఇక్కడికి వస్తున్నారు
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ పీఎస్‌ఎల్ స్థాయి ఏమిటో గుర్తు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన వాళ్లు, లేదంటే ఐపీఎల్‌లో కెరీర్ ముగిసిపోయిందని భావించిన ఆటగాళ్లు.. అదీ కాదంటే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని వాళ్లు మాత్రమే పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు వస్తున్నారు.
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌లో కెరీర్ ముగిసిన తర్వాతే ఇక్కడికి వచ్చారు. చిన్న అవకాశం దొరికినా చాలా మంది ఐపీఎల్‌లోనే కొనసాగుతారు. పీఎస్‌ఎల్ జట్లతో ఒప్పందం కుదుర్చుకున్నా ఐపీఎల్ నుంచి ఆఫర్ వస్తే అక్కడికే వెళ్తారు. అప్పుడు మీరు ఎంతమందిపై నిషేధం విధించగలరు?’’ అని అహ్మద్ షెబాద్ పాక్ బోర్డు పరువు తీశాడు.
అసలు ఇవేం ప్రశ్నలు?
ఇక పాక్ మీడియా వైఖరిని ప్రస్తావిస్తూ.. ‘‘కుశాల్ మెండిస్ పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నాడు. అతడి దగ్గరికి వెళ్లి.. ‘సర్.. గతేడాది మీరు ఈ లీగ్ వదిలి ఐపీఎల్‌కు వెళ్లారు కదా! దాని గురించి మీ స్పందన ఏమిటి?’ అని మనోళ్లు అడుగుతున్నారు. అసలు ఇవేం ప్రశ్నలు?
పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న రిలీ రొసోవ్ దగ్గరికి వెళ్లి.. ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోల్చమంటారు. అతడు ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నాడు కాబట్టి ఐపీఎల్‌ను ఎలా పొగడగలడు? అందుకే ఐపీఎల్‌లో క్రికెట్ కంటే బాలీవుడే ఎక్కువగా కనిపిస్తోందని ఏదేదో చెప్పాడు’’ అని అహ్మద్ షెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చదవండి: రహానేపై చర్యలు


