ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో కేకేఆర్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఓటమి బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్య రహానేపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. సీఎస్‌కే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో మొదటి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టింది. ప్రస్తుత సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించబడిన నాలుగో కెప్టెన్ రహానే.
కాగా, ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు ఎదర్కొంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు అత్యల్ప రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఏదీ కలిసి రావడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే కీలక బౌలర్లంతా దూరం కాగా.. భారీ అంచనాలు పెట్టుకున్న గ్రీన్ తుస్సుమనిపిస్తున్నాడు. కెప్టెన్ రహానే సహా మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు ప్రదర్శనలతో మమ అనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క ఆటగాడి నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన రాలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేకేఆర్ ఈ సీజన్‌ను గెలుపు లేకుండా ముగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ సీఎస్‌కే చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయం ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన రమన్‌దీప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


