బెల్‌ఫాస్ట్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒక స్థానిక వ్యక్తిపై సుడాన్ దేశానికి చెందిన శరణార్థి జరిపిన కత్తిపోట్ల దాడి.. నగరంలో భారీ ఎత్తున వలస వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు వీధుల్లోకి వచ్చి, వలసదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి, దీనిని ఒక ‘తీవ్రమైన సంక్షోభ పరిస్థితి’గా ప్రకటించారు.
అర్ధరాత్రి ఘోరం.. కత్తితో విచక్షణారహితంగా దాడి
బెల్‌ఫాస్ట్‌లోని కిన్నైర్డ్ ఎవెన్యూలో సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. స్టీఫెన్ ఓగిల్వీ (44) అనే స్థానిక వ్యక్తిపై 30 ఏళ్ల సుడాన్ శరణార్థి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓగిల్వీ ముఖం, మెడ, వీపు, కళ్ల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ వీడియోతో..
నడిరోడ్డుపై జరిగిన ఈ భీభత్సానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో ప్రపంచవ్యాప్త రైట్-వింగ్ నేతలు తీవ్రంగా స్పందించారు. బ్రిటీష్ నేత జేమ్స్ రాబిన్సన్ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఎలాన్ మస్క్ సైతం ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ, నిరసనలు జరగబోయే ప్రాంతాల వివరాలను పంచుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ముసుగులు ధరించిన నిరసనకారులు శరణార్థుల ఇళ్లపై రాళ్లు, ఇటుకలతో దాడులు చేస్తూ ‘స్థానిక ఇళ్లు స్థానికులకే’ అంటూ గోడలపై నినాదాలు రాశారు.
తగలబడుతున్న వీధులు..
ఈ వలస వ్యతిరేక ప్రదర్శనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో బెల్‌ఫాస్ట్ వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు వలసదారుల ఇళ్లను, వాహనాలను తగులబెట్టారు. ఒక మిడిల్ ఈస్టర్న్ సూపర్‌మార్కెట్‌కు కూడా నిప్పు పెట్టారు. ప్రాణభయంతో వలసదారులు తమ ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి లాంగ్ ఈ హింసాకాండను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలంతా సంయమనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: అఫ్గాన్‌పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం


