పారిస్: ఫ్రాన్స్,స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో భీకర కార్చిచ్చు దహించివేస్తోంది. ఇప్పటి వరకు రెండు దేశాల్లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం గిరాండ్‌లో సుమారు 42వేల హెక్టార్ల మేర అడవి కాలిపోయింది. సమీప 240 ఇళ్లు కాలిపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన 75 మంది సిబ్బంది గాయపడ్డారు.
18 విమానాలు, హెలికాప్టర్లతో 2,500కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బోర్డో నగర ప్రధాన రహదారిని పాక్షికంగా మూసేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చుట్టుపక్కల కార్చిచ్చు వ్యాపించింది. స్పెయిన్‌లో 76వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాలెన్సియా శివారు ప్రాంతం మనిసెస్‌లో కార్చిచ్చులో ఒకరు మరణించారు.
ఓరెగాన్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలో బెంచ్‌ఫైర్ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. దీంతో, ఆ ప్రాంత జెఫెర్సన్ కౌంటీ నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికారులు హెచ్చరికలు చేశారు. వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలోని 26వ నంబర్ రహదారిని అధికారులు మూసివేశారు.


