భారత జెన్-జీకి పాక్‌, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే.. | Pak Nepal srilanka on indias gen g compaign | Sakshi
Sakshi News home page

భారత జెన్-జీకి పాక్‌, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..

Jul 26 2026 8:51 PM | Updated on Jul 26 2026 9:08 PM

Pak Nepal srilanka on indias gen g compaign

భారత జెన్-జీని తరచూ మొబైల్‌లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్‌గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.

ఈ ఉద్యమం ఇప్పుడు భారత్‌కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్‌లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్‌లోని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.

దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్‌ జనతా పార్టీ చాలా కూల్‌గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్‌గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.

ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం 
ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్‌లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు.

"అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.

బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్‌లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.

శ్రీలంక యువతపై ప్రభావం
భారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.

భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్‌మెన్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్‌బుక్‌లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యువతకు సందేశం పంపారు.

"శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్‌ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు.  

నేపాల్ యువత మద్దతు
నేపాల్‌లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.

జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..
ఢిల్లీ జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement