ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ జట్టు, చివరి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్‌పై భారీ స్కెచ్ వేసింది. ఇవాళ మధ్యాహ్నం ఇరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడాల్సి ఉండగా.. ముంబై రాజస్థాన్‌ను ఓడించి, వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగుతుంది.
ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ రెండు కీలక మార్పులు చేసింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన క్వింటన్ డికాక్, రాజ్ అంగద్ బవాకు బదులుగా మహిపాల్ లోమ్రార్, రుచిత్ అహిర్‌లను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు డికాక్ మణికట్టు గాయానికి గురి కాగా.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజ్ అంగద్ బవా బొటనవేలి లిగమెంట్ టియర్‌కు గురయ్యాడు. ఈ ఇద్దరూ నేటి మ్యాచ్ ఆడే అవకాశం లేకపోవడంతో యాజమాన్యం వెంటనే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
రాజస్థాన్‌కు చెందిన లోమ్రార్‌కు ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. 2018 నుంచి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతడు 40 మ్యాచ్‌లు ఆడాడు. మిడిలార్డర్‌లో డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న లోమ్రార్.. బంతితోనూ సత్తా చాటగలడు. ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ అతన్ని రూ.50 లక్షలకు జట్టులోకి తీసుకుంది.
రుచిత్ అహిర్ విషయానికొస్తే.. ఇతగాడికి ఇదే తొలి ఐపీఎల్ అవకాశం. సౌరాష్ట్రకు చెందిన ఈ 25 ఏళ్ల బ్యాటర్ ఇప్పటివరకు 16 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో 169కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 333 పరుగులు చేశాడు. ఇతడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు ఎంపిక చేసింది.
ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌కు షాక్ ఇచ్చి గెలుపుతో సీజన్‌ను ముగించాలని ముంబై జట్టు పట్టుదలగా ఉంది.


