ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు! | 2 teams don't want him: Aakash Chopra Best swap deals for Hardik Pandya | Sakshi
Sakshi News home page

IPL 2027: ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

Jul 3 2026 2:28 PM | Updated on Jul 3 2026 2:43 PM

2 teams don't want him: Aakash Chopra Best swap deals for Hardik Pandya

ఐపీఎల్‌-2027 సీజన్‌ వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి చర్చలు కొనసాగుతున్నాయి. వేలానికి ముందే ముంబై ఇండియన్స్‌ అతడిని ట్రేడ్‌ చేసేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ క్రమంలో దాదాపుగా ఏడు జట్లు హార్దిక్‌ పాండ్యా కోసం ముంబై యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు జట్లకు అతడు అక్కర్లేదు!
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘హార్దిక్‌ పాండ్యాను సొంతం చేసుకునేందుకు దాదాపుగా అన్ని జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రెండు జట్లు మాత్రం అతడిని అస్సలు కోరుకోవడం లేదట. ఒకటి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. రెండు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

ఈ రెండూ తప్ప అన్ని జట్లు.. ఆఖరికి గుజరాత్‌ టైటాన్స్‌ కూడా హార్దిక్‌ పట్ల ఆసక్తి చూపడం నిజంగా విశేషమే. నాకిది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కూడా!..  ఒకవేళ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముంబైతో సంప్రదింపులు జరిపినట్లయితే.. ముంబైకి ఓపెనర్‌ అవసరం లేదు.

రింకూ సింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది
వాళ్లకు హార్దిక్‌ మాదిరి లోయర్‌ ఆర్డర్‌లో రాణించగల ఆటగాడు కావాలంటే.. రింకూ సింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, హార్దిక్‌ బదులు రింకూను డైరెక్ట్‌గా స్వాప్‌ చేయలేరు. రింకూతో పాటు హర్షిత్‌ రాణా లేదంటే వరుణ్‌ చక్రవర్తిని కోల్‌కతా ముంబైకి ఇవ్వాల్సి ఉంటుంది.

అలా కాదంటే.. హర్షిత్‌ రాణా- అనుకుల్‌ రాయ్‌ను ఇచ్చేసి హార్దిక్‌ను అడగవచ్చు. ఇక మూడో ఆప్షన్‌.. రింకూ- అనుకుల్‌ రాయ్‌. ఒకవేళ లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా రంగంలో ఉందంటే.. వాళ్లు నికోలస్‌ పూరన్‌ ఒక్కడిని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోవచ్చు.

అక్షర్‌ను అంత తేలికగా వదులుకోరు
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ హార్దిక్‌ను కోరుకుంటే.. వాళ్లు అక్షర్‌ పటేల్‌తో పాటు అశుతోశ్‌ శర్మను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్లు అక్షర్‌ను అంత తేలికగా వదులుకోరు. పంజాబ్‌ కింగ్స్‌ విషయానికొస్తే.. హార్దిక్‌ కోసం వాళ్లు ఏకంగా అర్ష్‌దీప్‌ సింగ్‌నే త్యాగం చేయాల్సి రావొచ్చు.

అయితే, అర్ష్‌కు బదులు నేహాల్‌ వధేరా- శశాంక్‌ సింగ్‌లను ఇస్తామని చెప్పవచ్చు. రాజస్తాన్‌ రాయల్స్‌ గనుక బరిలో ఉంటే.. యశస్వి జైస్వాల్‌ కోరుకుంటే అతడిని ముంబైకి ఇచ్చేయవచ్చు. కానీ అతడు ఓపెనర్‌ కాబట్టి ముంబై ఆసక్తి చూపకపోవచ్చు.

చెన్నై విషయానికొస్తే..
గుజరాత్‌ హార్దిక్‌ను కోరుకుంటే.. ముంబై అతడికి బదులు రషీద్‌ ఖాన్‌ను అడగవచ్చు. లేదంటే కగిసో రబడను కూడా కోరవచ్చు. కానీ గుజరాత్‌ అందుకు అంగీకరించడం కష్టమే. ఇక చెన్నై విషయానికొస్తే.. శివం దూబేతో పాటు ఖలీల్‌ అహ్మద్‌ను హార్దిక్‌ బదులుగా ఇచ్చేయాల్సి రావొచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

కాగా కెరీర్‌ ఆరంభం నుంచి చాలా ఏళ్ల పాటు ముంబైకి ఆడిన హార్దిక్‌ పాండ్యాను ఫ్రాంఛైజీ 2022లో వదిలేసింది. దీంతో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ పిలిచి మరీ హార్దిక్‌ను కెప్టెన్‌ చేయగా.. తొలి సీజన్‌లోనే టైటిల్‌ అందించాడు. మరుసటి ఏడాది ఫైనల్‌కు తీసుకువెళ్లాడు.

అయితే, 2024 వేలానికి ముందే హార్దిక్‌ ముంబైకి ట్రేడ్‌ అయ్యాడు. ఇక్కడ మూడు సీజన్లలో సారథిగా ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్‌ చేర్చగా.. రెండుసార్లు దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ముంబై అతడిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement