రొనాల్డో (PC: FIFA)
పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రొనాల్డో 41 ఏళ్ల 147 రోజుల వయసులోఈ ఘనత సాధించాడు.
తద్వారా ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో 40 ఏళ్ల వయసు తర్వాత గోల్ కొట్టిన ఫుట్‌బాలర్‌గానూ రొనాల్డో చరిత్రకెక్కాడు. ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా క్రొయేషియాతో జరిగిన రౌండ్32 మ్యాచ్ సందర్భంగా ఈ పోర్చుగల్ దిగ్గజం ఈ ఘనత సాధించాడు.
అంతకుముందు ఈ రికార్డు పోర్చుగల్‌కే చెందిన పెపె పేరిట ఉండేది. 2022లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 39 ఏళ్ల 283 రోజుల వయసులో పెపె గోల్ కొట్టాడు. రొనాల్డో ఇప్పుడు అతడిని అధిగమించాడు.
ప్రిక్వార్టర్స్‌కు పోర్చుగల్
టొరొంటో వేదికగా పోర్చుగల్- క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ రెండో అర్దభాగంలో... ఇవాన్ పెరిసిక్ 53వ నిమిషంలో గోల్ కొట్టడంలో క్రొయేషియా ఖాతా తెరిచింది.
ఈ క్రమంలో పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక అదనపు సమయంలో (90+4) రామోస్ గోల్ కొట్టి పోర్చుగల్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. అయితే, 103వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు జోస్కో గవార్డియాల్ గోల్ కొట్టగా.. సమీక్ష తర్వాత వీడియో అసిస్టెంట్ రిఫరీ(VAR) మాత్రం దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు.
దీంతో క్రొయేషియా నిరాశలో మునిగిపోగా.. పోర్చుగల్ 2-1తో జయభేరి మోగించి.. రౌండ్ 16కు దూసుకవెళ్లింది. కాగా ఆటగాడు బాల్‌ను అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందు ఉండి.. తద్వారా ఆటలో ప్రభావం చూపినట్లయితే దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. ఆ సమయంలో సదరు ఆటగాడు గోల్ కొట్టినా అది చెల్లదు.


