పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరో కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి కుదుర్చుకున్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒప్పందంపై సంతకాలు జరిగి కొన్ని రోజులే అవుతున్నా.. అప్పుడే దాని ప్రభావం మరో వైపు కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా-యూఏఈ మధ్య దూరం మరింత పెరుగుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అసలు ఏం జరిగింది?
ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలోని ప్రధాన సూత్రం ఒక్కటే.. ముగ్గురిలో ఏదో ఒక దేశంపై దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించడం. అంటే.. చమురు సంపదతో బలమైన సౌదీ, అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్తాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం ఉన్న టర్కీ ఒకే రక్షణ గొడుగు కిందకు వచ్చినట్లే అయ్యింది. ఇదే కారణంగా కొందరు నిపుణులు దీనిని ఇప్పటికే ‘ఇస్లామిక్ నాటో’గా పిలవడం మొదలుపెట్టారు.
కూటమి ఇంతటితో ఆగదా?
మక్కా ఒప్పందం ముగ్గురు దేశాలకే పరిమితం కాదనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్‌బైజాన్, సిరియా వంటి దేశాలను భవిష్యత్‌లో కూటమిలోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే.. పశ్చిమాసియాలో కొత్త భద్రతా బ్లాక్ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.
‘GCC ఉండగా కొత్త కూటమి ఎందుకు?’
సౌదీ నిర్ణయంపై యూఏఈకి చెందిన ప్రముఖ స్వరాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ సభ్యులుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఇప్పటికే ఉంది. అంతేకాదు.. సభ్య దేశాలపై దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే సంయుక్త రక్షణ వ్యవస్థ కూడా ఉంది. అలాంటప్పుడు.. గల్ఫ్ వెలుపల ఉన్న టర్కీ, పాకిస్తాన్‌లతో కలిసి సౌదీ కొత్త రక్షణ కూటమిని ఎందుకు ఏర్పాటు చేసిందన్నది యూఏఈ వర్గాల ప్రశ్న. యూఏఈ రాజకీయ విశ్లేషకుడు, ఆ దేశ అధ్యక్షుడి మాజీ సలహాదారు అబ్దుల్‌ఖలీఖ్ అబ్దుల్లా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. గల్ఫ్ దేశాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
సౌదీ కూడా తగ్గలేదు!
యూఏఈ నుంచి విమర్శలు రావడంతో సౌదీ వర్గాలు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాయి. ప్రతి దేశానికీ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంది అంటూ సౌదీ యువరాజు అబ్దుల్‌రహ్మాన్ బిన్ ముసైద్ ప్రశ్నించారు. అంతేకాదు.. సౌదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న యూఏఈ తన భద్రతా భాగస్వామ్యాలను ఒకసారి చూసుకోవాలని సౌదీ వ్యాఖ్యాతలు సూచించారు.
భారత్, ఇజ్రాయెల్ పేర్లు ఎందుకొచ్చాయి?
ఇక్కడే ఈ వివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. సౌదీ వ్యాఖ్యాతలు.. యూఏఈ-భారత్ రక్షణ సహకారం, యూఏఈ-ఇజ్రాయెల్ భద్రతా సంబంధాలను ప్రస్తావించారు. యూఏఈ ఇతర దేశాలతో భద్రతా భాగస్వామ్యాలు పెట్టుకోవచ్చు.. కానీ సౌదీ టర్కీ, పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంటే మాత్రం ఎందుకు అభ్యంతరం ఎందుకు? అన్నది వారి వాదన. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. భారత్, యూఏఈ మధ్య సంయుక్త రక్షణ ఒప్పందం లేదు. కానీ ఇరు దేశాల మధ్య చాలాకాలంగా రక్షణ సహకారం కొనసాగుతోంది. 2026 జనవరిలో ఈ సహకారాన్ని మరింత విస్తరించేలా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి కూడా ఇరు దేశాలు రూపకల్పన చేశాయి. ఇజ్రాయెల్‌తో మాత్రం యూఏఈ 2020లో అబ్రహామ్ ఒప్పందాల ద్వారా సంబంధాలను సాధారణీకరించింది.
యెమెన్‌లోనే అసలు విభేదాల బీజాలు!
సౌదీ-యూఏఈ మధ్య విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావు. యెమెన్ విషయంలోనే ఇరు దేశాల వ్యూహాలు చాలా కాలంగా వేర్వేరు మార్గాల్లో సాగుతున్నాయి. సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా.. యూఏఈ దక్షిణాది వేర్పాటువాద శక్తులకు మద్దతుగా నిలిచింది. అంటే.. బయటకు మిత్రదేశాలుగానే కనిపిస్తున్నా, కీలకమైన ప్రాంతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలు వేర్వేరుగా మారుతున్నాయి.
ముందు ఏం జరగబోతోంది?
మక్కా ఒప్పందం మరిన్ని దేశాలకు విస్తరిస్తే.. మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవైపు సౌదీ-టర్కీ-పాకిస్థాన్ అక్షం బలపడుతుంటే.. మరోవైపు యూఏఈ తన భారత్, ఇజ్రాయెల్ సహా ఇతర వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. మక్కాలో పుట్టిన ఈ కొత్త రక్షణ కూటమి.. ఇస్లామిక్ ప్రపంచానికి భద్రతా కవచమా? లేక గల్ఫ్‌లోనే కొత్త విభేదాలకు కారణమా?. రాబోయే రోజుల్లో ఈ సమీకరణం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.


