ఇక జీతాలు ఆలస్యమైతే చర్యలు ఇవే.. | UAE Salary Rules 2026 Employers Warning Delayed Wages | Sakshi
Sakshi News home page

ఇక జీతాలు ఆలస్యమైతే చర్యలు ఇవే..

Oct 2 2026 1:37 AM | Updated on Oct 2 2026 1:45 AM

UAE Salary Rules 2026 Employers Warning Delayed Wages

దుబాయ్‌: యూఏఈలో ప్రైవేట్‌ రంగ ఉద్యోగుల వేతన చెల్లింపులపై ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. ఉద్యోగుల జీతాలు ఆలస్యమైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా.. ముందుగా సంబంధిత సంస్థలకు ఎలక్ట్రానిక్‌ నోటిఫికేషన్లు, హెచ్చరికలు జారీ చేసి సమస్యను పరిష్కరించుకునే అవకాశం కల్పించే విధానాన్ని మానవ వనరులు, ఎమిరేటైజేషన్‌ మంత్రిత్వ శాఖ (MOHRE) స్పష్టం చేసింది. ఉల్లంఘన కొనసాగితే నిర్ణయించిన కాలక్రమం ప్రకారం పరిపాలనా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ముందుగా నోటీసు.. ఆ తర్వాత చర్య

కొత్త వేతన రక్షణ వ్యవస్థ (WPS)లో భాగంగా వేతన చెల్లింపులను ఎలక్ట్రానిక్‌ విధానంలో పర్యవేక్షిస్తారు. జీతాల చెల్లింపులో ఆలస్యం గుర్తించిన తర్వాత సంస్థలకు అలర్ట్‌లు, నోటిఫికేషన్లు పంపిస్తారు. దీని ఉద్దేశం కంపెనీలకు తమ తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు ఉద్యోగుల వేతన హక్కులను వేగంగా రక్షించడం.

జీతం చెల్లించాల్సిన గడువు ఇదే

2026 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన మంత్రి తీర్మానం నంబర్‌ 340 ప్రకారం.. ఎమిరేటైజేషన్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రైవేట్‌ రంగ సంస్థలు గత నెలకు సంబంధించిన వేతనాలను తదుపరి నెల మొదటి తేదీలోగా చెల్లించాలి. ఆ గడువు దాటితే WPSలో చెల్లింపు ఆలస్యంగా పరిగణిస్తారు. మొత్తం చెల్లించాల్సిన వేతనాల్లో కనీసం 85 శాతం నిర్ణీత గడువులో చెల్లించిన సంస్థను సమ్మతి ప్రమాణాలకు అనుగుణంగా పరిగణించే విధానాన్ని కూడా నిబంధనలు నిర్దేశించాయి.

ఆలస్యం కొనసాగితే దశలవారీ చర్యలు

వేతనాలు చెల్లించకుండా ఆలస్యం కొనసాగితే చర్యలు క్రమంగా కఠినతరం అవుతాయి. రెండో రోజు నుంచి సంస్థలకు హెచ్చరికలు, నోటిఫికేషన్లు వెళ్లవచ్చు. ఐదో రోజు వరకు చెల్లింపులు సరిచేయకపోతే కొత్త వర్క్‌ పర్మిట్ల జారీపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. 11వ రోజుకు చేరినప్పుడు ఆరు నెలల వ్యవధిలో పునరావృత ఉల్లంఘనలకు పరిపాలనా జరిమానాలు, సంస్థ వర్గీకరణను మూడో కేటగిరీకి తగ్గించడం వంటి చర్యలు ఉండొచ్చు.

16వ రోజు కూడా వేతన బకాయిలు పరిష్కారం కాకపోతే, నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ప్రభావిత ఉద్యోగుల తరఫున వ్యక్తిగత లేదా సామూహిక కార్మిక వివాదాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21వ రోజు నాటికి పరిస్థితిని బట్టి బకాయి వేతనాల రికవరీకి ఎగ్జిక్యూటివ్‌ చర్యలు, ఆస్తులపై ముందస్తు జప్తు, బాధ్యులపై ప్రయాణ నిషేధం, తదుపరి చట్టపరమైన చర్యలు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కార్మికులు ఎక్కువగా ఉన్న రంగాలపై ప్రత్యేక దృష్టి

నిర్మాణం, రవాణా–నిల్వ, భద్రతా సేవలు, పారిశుద్ధ్యం, రిక్రూట్‌మెంట్‌ వంటి అధిక సంఖ్యలో కార్మికులు పనిచేసే రంగాల్లో ప్రమాద ఆధారిత పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వేతనాలు ఆలస్యమైతే ఉపాధి సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది.

నెలకు రూ.లక్షల కోట్ల వేతన చెల్లింపులు

యూఏఈ వేతన రక్షణ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా 37 బిలియన్‌ దిర్హామ్‌లకు పైగా వేతన చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలోని దాదాపు 6 లక్షల ప్రైవేట్‌ రంగ సంస్థలు ఈ వ్యవస్థ పరిధిలో ఉన్నాయని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 90కుపైగా బ్యాంకులు, ఎక్స్ఛేంజ్‌ హౌస్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు WPS ద్వారా వేతన చెల్లింపుల సేవలను అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement