రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి.. తాజాగా, ''కరెన్సీ విలువపై ప్రజలకు, ప్రభుత్వాలకు, పెట్టుబడిదారులకు నమ్మకం తగ్గితే ఏం జరుగుతుంది?'', అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది.
బంగారానికి డిమాండ్
డబ్బును దాచుకోవడం కంటే.. విలువైన ఆస్తులలో పెట్టుబడులుగా పెట్టడం మంచిదని అంటారు కియోసాకి. సంక్షోభం ఏర్పడినప్పుడు బంగారం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కారణంగానే బంగారాన్ని వేల సంవత్సరాలుగా విలువైన ఆస్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటే.. మార్కెట్‌లో గోల్డుకు డిమాండ్ పెరగవచ్చు.
అందుకే కియోసాకి బంగారాన్ని అలారం బెల్‌తో పోలుస్తున్నారు. ఎందుకంటే.. ఆర్థిక వ్యవస్థలో ఏదైనా మార్పు వస్తే.. బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
బంగారం తరువాత వెండి
బంగారం ధరలు పెరిగినప్పుడు.. పెట్టుబడిదారుల చూపు వెండి వైపు పడుతుంది. వెండికి పారిశ్రామిక రంగంలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ టెక్నాలజీ వంటి రంగాల్లో సిల్వర్ ఉపయోగం విరివిగా ఉంటుంది. దీంతో పెట్టుబడి డిమాండ్‌తో పాటు పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ధరపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.

మైనింగ్ కంపెనీలు
బంగారం, వెండి ధరలు పెరిగితే.. వాటిని భూమి నుంచి వెలికితీసే కంపెనీలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందని కియోసాకి చెబుతారు. ఎందుకంటే లోహాల ధరలు పెరిగినప్పుడు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉంటే మైనింగ్ కంపెనీల ఆదాయాలు, లాభాల అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు.
సాధారణ పెట్టుబడిదారులు మార్కెట్‌లో మార్పు స్పష్టంగా కనిపించే వరకు వేచి ఉండకూడదని కియోసాకి చెబుతారు. పెట్టుబడుల విషయంలో ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకోవడం కంటే.. ఆర్థిక పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకోవడం మంచిదని చెబుతారు.
ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు!


