పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌కు చెందిన ఏ బ్యాటర్‌ను భారత స్టార్ విరాట్ కోహ్లితో పోల్చవచ్చని అడగ్గా.. చాలామంది ఊహించినట్లుగా ప్రస్తుత పాక్ టెస్ట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం పేరు చెప్పలేదు. ఎవరూ ఊహించని విధంగా మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ పేరు చెప్పాడు.
హస్నా మనా హై అనే టాక్ షోలో మాట్లాడిన అక్తర్.. యూనిస్ ఖాన్‌కు సహజ ప్రతిభ కంటే కష్టపడి పనిచేయడం, ఫిట్‌నెస్, శిక్షణపై దృష్టి, నిరంతరం తనను తాను మెరుగుపరుచుకోవాలనే తపన ఎక్కువగా ఉండేవని తెలిపాడు.
విరాట్ కోహ్లిలా యూనిస్ ఖాన్ కూడా ఫిట్‌నెస్, ట్రైనింగ్‌పై ఎంతో కష్టపడ్డాడని, సహజంగా లభించిన ప్రతిభ పరిమితంగా ఉన్నప్పటికీ తన కష్టంతో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని అన్నాడు.
యూనిస్ ఖాన్‌ను ప్రశంసిస్తూ అక్తర్ మరో ఆసక్తికర విషయాన్ని గుర్తుచేశాడు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్లు ఇమ్రాన్ ఖాన్, యూనిస్ ఖాన్ మాత్రమే అని పేర్కొన్నాడు.
1992లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ గెలవగా, 2009లో యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
అద్భుత రికార్డు
2000లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యూనిస్ ఖాన్.. పాకిస్తాన్ బ్యాటింగ్‌కు చాలా కాలం వెన్నెముకగా నిలిచాడు. 118 టెస్టుల్లో 52.05 సగటున, 34 సెంచరీలు, 33 అర్ద సెంచరీల సాయంతో 10,099 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ (313) కూడా ఉంది. టెస్టుల్లో 10,000 పరుగుల మార్క్‌ను అందుకున్న ఏకైక పాకిస్తాన్ బ్యాటర్ యూనిస్ ఖాన్.
వన్డే కెరీర్ విషయానికొస్తే.. యూనిస్ 265 మ్యాచ్‌ల్లో 7,249 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ఆల్‌టైమ్ గ్రేట్ మాత్రం సచినే..!
ఇదే కార్యక్రమంలో అక్తర్‌ను అత్యుత్తమ బ్యాటర్ ఎవరు అని అడగ్గా.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను పక్కనపెట్టి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఎంచుకున్నాడు.
సచిన్‌ను ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్‌గా పేర్కొంటూ, అతడు తన దృష్టిలో ఇతర దిగ్గజాల కంటే ప్రత్యేకమైన ఆటగాడని స్పష్టం అన్నాడు.


