కోహ్లి కచ్చితంగా పశ్చాత్తాపపడతాడు: టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ | I Feel Sorry: Kapil Dev Claims Kohli Will Regret Test Retirement In Few Years | Sakshi
Sakshi News home page

కోహ్లి కచ్చితంగా పశ్చాత్తాపపడతాడు: టీమిండియా దిగ్గజ కెప్టెన్‌

Sep 30 2026 10:50 AM | Updated on Sep 30 2026 11:28 AM

I Feel Sorry: Kapil Dev Claims Kohli Will Regret Test Retirement In Few Years

విరాట్‌ కోహ్లి (PC: BCCI X)

భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి గురించి టీమిండియా లెజెండరీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించి కోహ్లి తప్పు చేశాడన్నాడు. అతడి అభిమానిగా, మాజీ క్రికెటర్‌గా ఈ విషయంలో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపాడు.

టీ20, టెస్టులకు గుడ్‌బై
కాగా 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత నాటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది రోహిత్‌ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సుమారు వారం రోజుల వ్యవధిలోపే కోహ్లి కూడా సంప్రదాయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

అన్ని రికార్డులను బద్దలు కొట్టేవాడు
అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వైఖరి కారణంగానే రో-కో ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 1983లో భారత్‌కు తొలి వరల్డ్‌కప్‌ అందించిన కపిల్‌ దేవ్‌ కోహ్లి టెస్టు కెరీర్‌ గురించి తాజాగా  స్పందించాడు.

‘‘అతడు గొప్పగా ఆడుతున్నాడు. ఇప్పటికీ తనలో ఇంకా టెస్టు క్రికెట్‌ మిగిలే ఉంది. 37 ఏళ్ల వయసులోనూ అతడు ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. ఆటకు ఫిట్‌నెస్‌ ముఖ్యం. ఇంకో రెండు- మూడేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. అన్ని రికార్డులను అతడు బద్దలు కొట్టేవాడు. అతడి విషయంలో నాకు బాధగా ఉంది. అసలు కోహ్లి ఎందుకిలా చేశాడో నాకైతే అర్థం కాలేదు.

కోహ్లి కచ్చితంగా పశ్చాత్తాపపడతాడు
ప్రేక్షకుడిగా, అభిమానిగా, మాజీ క్రికెటర్‌గా నేను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. అతడు రిటైర్మెంట్‌ ప్రకటించకుండా ఉండాల్సింది. తన నిర్ణయం విషయంలో కోహ్లి ఎప్పుడు ఎలా ఫీలవుతున్నాడో నాకైతే తెలియదు.

ఇప్పటికైతే టెస్టు క్రికెట్‌ ఆపేశాడు. అయితే, కొన్నాళ్ల తర్వాత కచ్చితంగా కోహ్లి పశ్చాత్తాపపడతాడు. తాను ఇంకొన్నాళ్లు టెస్టు క్రికెట్‌ ఆడితే బాగుండేదని చింతిస్తాడు. అతడికి క్రికెట్‌ అంటే ప్రాణం. టెస్టు క్రికెట్‌ అతడికి ఎంతో ఇష్టమైనది.

అయితే, ఆటగాడిగా ఎప్పుడు ఆట నుంచి తప్పుకోవాలన్నది అతడి సొంత నిర్ణయం. కానీ మనం మాత్రం అతడి ఆటను ఇంకా చూడాలని కోరుకుంటున్నాం. అంత మాత్రాన కోహ్లి టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని చెప్పడం సరికాదు. అది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయం’’ అని కపిల్‌ దేవ్‌ PTIతో పేర్కొన్నాడు.

సారథిగానూ బెస్ట్‌
కాగా టీమిండియా తరఫున 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో 30 టెస్టు శతకాలు ఉన్నాయి. కెప్టెన్‌గా భారత్‌ను టెస్టుల్లో నంబర్‌ వన్‌ జట్టుగా నిలిపిన ఘనత అతడిదే. విదేశాల్లోనూ సారథిగా టెస్టు ఫార్మాట్లో కోహ్లికి మంచి రికార్డు ఉంది.

చదవండి: అగార్కర్‌ స్థానంలో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా ఓజా నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement