మోహిత్‌ శర్మకు సీఎస్‌కేలో కీలక పదవి | Mohit Sharma to join CSK as bowling coach | Sakshi
Sakshi News home page

మోహిత్‌ శర్మకు సీఎస్‌కేలో కీలక పదవి

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

Mohit Sharma to join CSK as bowling coach

source: X

చెన్నై సూపర్‌ కింగ్స్‌లో మరో కీలక నియామకం జరిగింది. కొద్ది రోజుల కిందట హెడ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను నియమించిన యాజమాన్యం, తాజాగా బౌలింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్‌ మోహిత్‌ శర్మను ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌గా ఎరిక్‌ సిమన్స్‌ కొనసాగారు.

మోహిత్‌ కెరీర్‌ విషయానికొస్తే.. అతడు భారత్ తరఫున 8 టీ20లు ఆడాడు. 2025 సీజన్‌ వరకు ఐపీఎల్‌ ఆడిన అతడు, గత ఏడాది డిసెంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో మోహిత్‌ సీఎస్‌కే తరఫున 48 మ్యాచ్‌లు ఆడాడు. అప్పటి ఛాంపియన్స్ లీగ్‌లో మరో 10 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.

హర్యానాకు చెందిన 38 ఏళ్ల మోహిత్‌ శర్మ 2013లో సీఎస్‌కే తరఫునే ఐపీఎల్‌ అరంగేట్రం చేసి, వరుసగా మూడేళ్లు ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత అతడు పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల తరఫున ఆడాడు. మొత్తంగా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 120 మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌ 134 వికెట్లు తీశాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2027 నేపథ్యంలో సీఎస్‌కేలో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న మైక్‌ హస్సీ కొనసాగుతాడో లేదో క్లారిటీ లేదు. యాజమాన్యం బ్యాటింగ్‌ కోచ్‌ పదవి కూడా కొత్త వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గత మూడు సీజన్లుగా జట్టు పేలవ ప్రదర్శనలు చేస్తుండటంతో యాజమాన్యం కోచింగ్‌ బృందాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తుంది.

2023లో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్‌కే.. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో దీర్ఘకాలంగా ప్రధాన కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌ యాజమాన్యం తప్పించింది. 

ఇదీ చదవండి: భారత్‌తో రెండో వన్డే.. విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement