మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణం
భారత్ ఖాతాలో మరో నాలుగు కాంస్యాలు
24 పతకాలతో ముగించిన అథ్లెటిక్స్ బృందం
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌ను ఊరిస్తూ వచ్చిన స్వర్ణం ఎట్టకేలకు పోటీల ఆఖరి రోజు వచ్చింది. మహిళల 4x400 బృందం స్వర్ణంతో మెరిసి సంతోషాన్ని నింపగా... మరో నాలుగు కాంస్యాలు కూడా మన ఖాతాలో చేరాయి. తమిళనాడు అథ్లెట్ విత్య రామ్‌రాజ్, యూపీ అథ్లెట్ గుల్వీర్ సింగ్ ఈ క్రీడల్లో తమ మూడో పతకాలను గెలుచుకోవడం విశేషం. అయితే 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 6 స్వర్ణాలతో మెరిసిన భారత అథ్లెటిక్స్ బృందం ఈసారి ఒకే ఒక గోల్డ్‌కే పరిమితం కాగా... గత 29 పతకాలతో పోలిస్తే ఈసారి కాస్త తక్కువగా 24 పతకాలతో ముగించింది.
ఏషియాడ్‌లో ఏడోసారి...
2026 ఏషియాడ్ అథ్లెటిక్స్‌లో భారత్ ఏకైక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మంగళవారం జరిగిన మహిళల 4x400 మీటర్ల రిలే పరుగులో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. కిరణ్ పహల్, ఎంఆర్ పూవమ్మ, ప్రాచీ చౌధరీ, విత్య రామ్‌రాజ్ సభ్యులుగా ఉన్న మన బృందం రేసును 3 నిమిషాల 29.69 సెకన్లలో పూర్తి చేసింది. బహ్రెయిన్ (3 నిమిషాల 30.21 సెకన్లు) బృందం రజత పతకం సాధించగా, చైనా బృందం (3 నిమిషాల 31.02 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది.
మూడో లెగ్ ముగిసే సమయానికి భారత్ మూడో స్థానంలోనే ఉన్నా... చివరి లెగ్‌లో అద్భుతంగా పరుగెత్తిన విత్య జట్టును అగ్రస్థానంలో నిలిపింది. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల 4x400 మీటర్ల పరుగులో భారత్‌కు ఇది ఏడో స్వర్ణం కావడం విశేషం. గతంలో 1986, 2002, 2006, 2010, 2014, 2018లలో కూడా మన జట్టు పసిడి పతకాలు నెగ్గింది. 2023లో భారత్‌కు రజతం లభించింది. 36 ఏళ్ల పూవమ్మ గతంలో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన జట్లలో సభ్యురాలిగా ఉంది.
మిక్స్‌డ్‌లో కంచు మోత...
4్ఠ100 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో కూడా భారత్ కాంస్యాన్నే గెలుచుకుంది. అనిమేశ్ కుజుర్, గురీందర్‌వీర్ సింగ్, స్నేహ సత్యనారాయణ, హరిత భద్ర సభ్యులుగా ఉన్న జట్టు రేస్‌ను 41.06 సెకన్లలో ముగించి మూడో స్థానం దక్కించుకుంది. చైనా (40.78 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, థాయ్‌లాండ్ (40.87 సెకన్లు) రజతం నెగ్గింది. జట్టులోని నలుగురు భారత అథ్లెట్లకు కూడా ఇదే తొలి ఆసియా పతకం.

పురుషుల జట్టుకు కాంస్యం...
4x400 మీటర్ల పరుగులో మహిళల జట్టు స్వర్ణం సాధించగా, పురుషుల బృందం కాంస్యంతో ముగించింది. ధరమ్‌వీర్ చౌధరీ, మను తెక్కినలిల్, జై కుమార్, విశాల్ తెన్నరసు సభ్యులుగా ఉన్న మన జట్టు రేస్‌ను 3 నిమిషాల 01.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. జపాన్ (3 నిమిషాల 00.75 సెకన్లు), ఖతర్ (3 నిమిషాల 00.93 సెకన్లు) స్వర్ణ, రజతాలు నెగ్గాయి. ఈ నలుగురికి కూడా ఇదే తొలి ఆసియా క్రీడల పతకం కావడం విశేషం.

గుల్వీర్ మళ్లీ...
10,000 మీటర్లు, 1500 మీటర్ల రేస్‌లలో ఇప్పటికే 2 రజతాలు నెగ్గిన గుల్వీర్ సింగ్ ఇప్పుడు కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల 5,000 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచాడు. గుల్వీర్ ఈ పరుగును 13 నిమిషాల 32.75 సెకన్లలో పూర్తి చేయగా... బిర్హాను బాలే (బహ్రెయిన్–13 నిమిషాల 30.79 సెకన్లు) స్వర్ణం, తొమొనొరి యమగూచి (జపాన్–13 నిమిషాల 31.43 సెకన్లు) రజతాలు నెగ్గారు.

మరోవైపు మరో నాలుగు ఈవెంట్‌లలో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. పురుషుల పోల్‌వాల్ట్‌లో దేవ్‌కుమార్ మీనా (5.50 మీటర్లు) ఏడో స్థానంలో, కుల్దీప్ కుమార్ (5.35 మీటర్లు) పదో స్థానంలో నిలిచారు. మహిళల హ్యామర్‌త్రో ఫైనల్లో తాన్యా చౌధరీ (65.35 మీటర్లు), అనుష్క యాదవ్ (64.56 మీటర్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. మహిళల 800 మీటర్ల ఫైనల్లో పూజ (2ని:06.72 సెకన్లు) ఏడో స్థానంతో సంతృప్తి పడింది. పురుషుల 800 మీటర్ల ఫైనల్లో అఫ్సల్ (1ని:48.27 సెకన్లు) చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

5 ఒకే ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో గుల్వీర్ సింగ్ (3), విత్య రామ్‌రాజ్ (3) చేరారు. గతంలో పీటీ ఉష (4 పతకాలు; 1986), లేవీ పింటో (3 పతకాలు; 1951), కేఎం బీనామోల్ (3 పతకాలు; 2002) ఈ ఘనత సాధించారు.
పూజ పైపైకి...
మహిళల హైజంప్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. 19 ఏళ్ల పూజా సింగ్ 1.84 మీటర్ల ఎత్తుకు ఎగిరి మూడో స్థానంతో కంచు పతకాన్ని అందుకుంది. తన ఐదో ప్రయత్నంలో పూజా ఈ మార్క్‌ను అందుకుంది. అయితే మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చే క్రమంలో చివరి ప్రయత్నంలో 1.87 మీటర్లను లక్ష్యంగా పెట్టుకున్నా... దానిని అందుకోవడంలో విఫలమైంది. సైఫులెవా (ఉజ్బెకిస్తాన్; 1.90 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా, క్రిస్టినా ఒచినికోవా (కజకిస్తాన్; 1.87 మీటర్లు) రజతం సాధించింది.


