Photo Credit: BCCI Twitter
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రేపు గౌహతిలోని బర్సాపరా వేదికగా టీమిండియా రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌ను ఉతికారేసిన భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలోను గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంకంలో మంచి ఫామ్‌ను ప్రదర్శిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. తొలి వన్డేలో రోహిత్ తక్కువ పరుగులే చేసినప్పటికీ, ఉన్నంతసేపు షాట్లతో అలరించాడు. ఇక కోహ్లి మాత్రం మరోసారి తనలోని చేజింగ్ మాస్టర్‌ను బయటికి తీస్తూ అజేయ సెంచరీతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని విధంగా కోహ్లి తన బ్యాటింగ్‌లో వేగం పెంచడం విశేషం.
వీరోచిత శతకాలు..
ఇక బర్సాపరా స్టేడియంలోనూ ఈ ఇద్దరు సీనియర్లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఈ స్టేడియంలో చెరో రెండు వన్డే మ్యాచ్‌లు ఆడారు. కోహ్లి ఆడిన రెండు వన్డేల్లోనూ సెంచరీలు బాదగా, రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేయడంతో పాటు మరో మ్యాచ్‌లో అర్థశతకం బాదాడు.

Photo Credit: BCCI Twitter
తొలుత 2018లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా వచ్చి 117 బంతుల్లోనే 152 పరుగులు అజేయ ఇన్నింగ్స్‌తో మెరవగా, కోహ్లి 140 పరుగులు సాధించాడు. వీరిద్దరి మెరుపులతో విండీస్ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 42.1 ఓవర్లలోనే ఛేదించింది. అలా తొలిసారి గౌహతి వేదికగా టీమిండియా ఆడిన మ్యాచ్‌లో రో-కోలిద్దరు సెంచరీలతో చెలరేగడం విశేషం.
కోహ్లి సెంచరీ.. రోహిత్ అర్థసెంచరీ
ఇక రెండోసారి టీమిండియా బర్సాపరా స్టేడియంలో 2023లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లి (87 బంతుల్లో 113) సెంచరీ బాదగా, రోహిత్ శర్మ (67 బంతుల్లో 83) మెరుపు అర్థసెంచరీ సాధించాడు. గిల్ (70) రాణించాడు.

Photo Credit: BCCI Twitter
అనంతరం శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 306 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 67 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ దాసున్ షనక (88 బంతుల్లో 108 నాటౌట్) అజేయ సెంచరీ, పాతుమ్ నిసాంక (72) పరుగులు చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. అలా రెండోసారి కూడా రో-కో ద్వయం అదుర్స్ అనిపించింది.
ఇలా గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన రో-కో ద్వయం రేపటి వన్డేలో మరోసారి చెలరేగితే మాత్రం విండీస్‌కు చుక్కలే అని చెప్పొచ్చు. కోహ్లి ఇప్పటికే సెంచరీతో తన ఉద్దేశాన్ని చాటి చెప్పగా, రోహిత్ భారీ ఇన్నింగ్స్‌తో అలరించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ స్టేడియంలో విండీస్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ, టీమిండియానే విజయం సాధించింది.
ఇదీ చదవండి: ఆసీస్‌ను చితకొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజు ముగిసిన ఆట


