విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ.. దశాబ్దకాలానికి పైగా టీమిండియాకు సేవలు అందిస్తున్న ఈ దిగ్గజాలు ఒకరి సారథ్యంలో మరొకరు ఆడారు. తొలుత కోహ్లి టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ తర్వాత రోహిత్ నాయకుడిగా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు లెజెండరీ బ్యాటర్లు యువ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఆడుతున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రో-కో.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారా? లేదా? అన్న సందేహాల నడుమ ఇటీవలే ఇద్దరూ పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు.
అప్పుడు హిట్‌మ్యాన్.. ఇప్పుడు కింగ్
ఇంగ్లండ్‌లో లార్డ్స్ వన్డేలో రోహిత్ శతక్కొట్టగా.. తాజాగా వెస్టిండీస్‌తో తొలి వన్డే సందర్భంగా తిరువనంతపురంలో కోహ్లి రికార్డు స్థాయిలో 55వ సెంచరీ నమోదు చేశాడు. ఇక భారత్- విండీస్ మధ్య బుధవారం రెండో వన్డే జరుగనున్న తరుణంలో రోహిత్ శర్మ జియోస్టార్‌తో మాట్లాడుతూ.. మైదానంలో తాను, కోహ్లి ఏం మాట్లాడుకుంటామో వివరించాడు.
ఎవరి బౌలింగ్‌లో దూకుడుగా ఆడాలి?
‘‘వన్డే వరల్డ్‌కప్.. కోహ్లి ఇప్పటికే 2011, 15, 109, 23లో ఈ టోర్నీ ఆడాడు. ఇప్పటికి నాలుగు వన్డే ప్రపంచకప్ ఈవెంట్లు పూర్తి చేసుకున్నాడు. 2027 టోర్నీ అతడికి ఐదో వరల్డ్‌కప్. కాబట్టి అతడికి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి మేము దీని గురించి ఎక్కువగా చర్చించుకోము.
అయితే, వరల్డ్‌కప్ టోర్నీ కోసం మేము చేయగలము అని మాత్రం చర్చించుకుంటాము. ముఖ్యంగా మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎవరి బౌలింగ్‌లో దూకుడుగా ఆడాలి.. ఎవరి బౌలింగ్‌లో సింగిల్స్ మాత్రమే తీయాలి అని మాట్లాడుకుంటాము.
సోదరా.. కాస్త జాగ్రత్తగా పరిగెత్తు
ఎప్పుడైనా నాకు కాలు నొప్పిగా అనిపిస్తే వెంటనే కోహ్లితో.. ‘సోదరా.. కాస్త జాగ్రత్తగా పరిగెత్తు.. నా పరిస్థితి కాస్త బాలేదు’ అని ముందుగానే చెప్పేస్తా. దాంతో అందుకు తగినట్లుగానే సింగిల్స్ విషయంలో కోహ్లి నిర్ణయం తీసుకుంటాడు. మేము కలిసి ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి దాదాపుగా ఇలాంటి విషయాలే మాట్లాడుకుంటున్నాము.
అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదు. మైదానంలో మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లము. అయితే, మా లక్ష్యం మాత్రం జట్టును గెలిపించడమే. ఇప్పుడూ అంతే. వరల్డ్‌కప్ ఆడాలి, గెలవాలి.. జట్టు కోసం సర్వశక్తులు ధారబోయాలి.. కేవలం ఇది మాత్రమే మా మనసులో ఉంటుంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


