PC: X
సెప్టెంబర్ 27, 2026.. వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఒకే రోజున వేర్వేరు వేదికల్లో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల్లో ఏకంగా 6 సెంచరీలతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒకే రోజు 6 వన్డే సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.
అంతకుముందు 5 సెంచరీలు నమోదు కావడమే అత్యధిక రికార్డుగా ఉండేది.తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఎక్స్ ) వేదికగా అధికారికంగా వెల్లడించింది.
ఈ ప్రపంచ రికార్డులో భాగమైన 6 సెంచరీల వివరాలు ఇవే:
విరాట్ కోహ్లి: తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి భారీ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో 139 పరుగులు చేశాడు.
కోహ్లికి తన వన్డే కెరీర్‌లో 55వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 86వ శతకం కావడం విశేషం. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యంత వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు.
శుబ్‌మన్ గిల్: ఇక ఇదే మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో 110 పరుగులు చేసి భారత్ 296 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు.
జస్టిన్ గ్రీవ్స్: తిరువనంతపురం వన్డేలో విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ (12 ఫోర్లతో 101 పరుగులు) కూడా విరోచిత సెంచరీ నమోదు చేశాడు.
డేవిడ్ మిల్లర్: జోహాన్స్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 93 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 142 పరుగులు చేశాడు.
టెంబా బవుమా: ఇదే మ్యాచ్‌లో ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా కూడా సెంచరీతో చెలరేగాడు. 116 బంతుల్లో బవుమా 103 పరుగులు చేశాడు.
టామ్ బాంటన్ : లండన్ వేదికగా శ్రీలంకతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ టామ్ బాంటన్ 126 (105 బంతుల్లో) శతక్కొట్టాడు.


