ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్ 2026-27 సీజన్ కోసం 'హోబర్ట్ హరికేన్స్' ఫ్రాంచైజీతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాబోయే సీజన్‌లో హరికేన్స్ జట్టుకు ఎంపికైన తొలి విదేశీ పురుషుల ఆటగాడిగా హోప్ నిలిచాడు. సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండనున్నాడు.
ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్, తమ జట్టు సీనియర్ ప్లేయర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకునేందుకు హోబర్ట్ హరికేన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్‌లో హోప్‌కు ఉన్న అపార అనుభవం జట్టుకు కలిసొస్తుందని ఫ్రాంచైజీ భావిస్తోంది.
హోప్ గతంలో హోబర్ట్ హరికేన్స్ తరఫునే హోప్ బిగ్ బాష్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ సీజన్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 115.73 స్ట్రైక్ రేట్‌తో కేవలం 103 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచడంతో ఫ్రాంచైజీ అతడిని వదులుకుంది. మళ్లీ ఇప్పుడు అదే జట్టుతో అతడు జతకట్టాడు. అరంగేట్ర సీజన్‌లో విఫలమైనప్పటికీ, ఈసారి మాత్రం బిగ్ బాష్ లీగ్‌లో సత్తా చాటాలని హోప్ పట్టుదలతో ఉన్నాడు.
హోప్ అరుదైన రికార్డు
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో షై హోప్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై 1,000 పరుగులు పూర్తి చేసిన 9వ విండీస్ బ్యాటర్‌గా అతడు నిలిచాడు. విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (997 పరుగులు) కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను హోప్ సాధించాడు.
అంతకుముందు విండీస్ దిగ్గజాలు బ్రియాన్ లారా, క్రిస్ గేల్, శివనారాయణ్ చంద్రపాల్ తదితరులు మాత్రమే భారత్‌పై వన్డేల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. భారత ఓపెనర్ డబుల్ సెంచరీ, రెండోరోజు ముగిసిన ఆట


