నాకూ అలాగే జరిగింది!.. కొత్త ‘చీఫ్‌ సెలక్టర్‌’కు వార్నింగ్‌! | Sunil Gavaskar On Team India Next Chief Selector As Agarkar Tenure To End, Says Be Prepared For Criticism, Old Reputation Won’t Protect You | Sakshi
Sakshi News home page

నాకూ అలాగే జరిగింది!.. టీమిండియా కొత్త ‘చీఫ్‌ సెలక్టర్‌’కు వార్నింగ్‌!

Sep 28 2026 4:15 PM | Updated on Sep 28 2026 4:44 PM

Gavaskar Warning Next BCCI Chief Selector As Agarkar Tenure To End

అజిత్‌ అగార్కర్‌ (PC:' BCCI)

టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం త్వరలోనే ముగియనుందన్న వార్తల నేపథ్యంలో భారత దిగ్గజ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొత్తగా వచ్చే చీఫ్‌ సెలక్టర్‌ అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగాలని సూచించాడు.

ఘనమైన విజయాలు
కాగా 2023లో అగార్కర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. అతడి హయాంలో భారత జట్టు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌కు చేరడంతో పాటు.. రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ (2024, 2026)లు గెలిచింది. అదే విధంగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆసియా కప్‌ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచింది.

అయితే, ఇప్పటికే రెండేళ్ల పదవీకాలం తర్వాత కూడా అగార్కర్‌ సేవల్ని కొనసాగించిన బీసీసీఐ.. త్వరలోనే అతడి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అక్టోబరు 4 తర్వాత తమ నుంచి ప్రకటన వస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించారు.

ఎంత గొప్ప పేరున్న వారైనా సరే..
ఈ  నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ మిడ్‌-డేకు రాసిన కాలమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తలు నిజమైతే.. న్యూజిలాండ్‌ పర్యటన నుంచే టీమిండియాకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌ వస్తాడు. ఐదు జోన్ల నుంచి సెలక్టర్లను నియమించడం బీసీసీఐ ఆనవాయితీ.

కాబట్టి ఈసారి వెస్ట్‌ జోన్‌ నుంచే ఎవరో ఒకరు చీఫ్‌ సెలక్టర్‌ అవుతారు. జాతీయ జట్టు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఉండటం నిజంగానే గొప్ప గౌరవం. అయితే, అందుకుతగినట్లునే లక్ష్యాలు కూడా నిర్దేశిస్తుంది యాజమాన్యం. గతంలో ఎంత గొప్ప పేరున్న వారైనా సరే.. ఇక్కడ చిన్న పొరపాటు చేసినా భూతద్దంలో పెట్టి చూస్తారు.

నిందలు కూడా అతడే భరించాల్సి వస్తుంది
వివిధ నిర్ణయాల్లో సెలక్టర్లంతా కలిసి చైర్మన్‌ను బలవంతంగానైనా ఒప్పిస్తారని చాలా మందికి తెలియదు. మీడియా ముందు చీఫ్‌ సెలక్టర్‌ వస్తాడు కాబట్టి అందరి దృష్టి అతడి మీదే ఉంటుంది. అందుకే నిందలు కూడా అతడే భరించాల్సి వస్తుంది. తప్పు చేసింది ఇతర సెలక్టర్‌ అయినా తిట్లు, విమర్శలు మాత్రం చీఫ్‌ సెలక్టర్‌కే వస్తాయి.

ముద్దు ముద్దు మాటలతో లీకులు
ఇప్పుడు కెప్టెన్‌ పూర్తిస్థాయిలో సెలక్టర్లతో కూర్చుని జట్టును ఎంపిక చేసుకుంటున్నాడో లేదో తెలియదు. కానీ తొలినాళ్లలో ఓటింగ్‌ పద్ధతి లేకుండానే కెప్టెన్‌ కో ఆప్షన్‌ పద్ధతిలో సెలక్షన్‌ కమిటీతో ఉండేవాడు. అప్పుడు కొంతమంది సెలక్టర్లు మీడియా మిత్రులతో ‘చిలక పలుకులు పలుకుతూ.. ముద్దు ముద్దు మాటలతో లీకులు ఇచ్చేవాళ్లు.

నాకూ ఇలాగే జరిగింది
కొంతమంది ఆటగాళ్లను పక్కనపెట్టడానికి కారణం కెప్టెనే అని నిందించేవారు. నా విషయంలో ఇది చాలాసార్లు జరిగింది. ఇదేమీ వాళ్లు సరదా కోసం చేయలేదు.  అయితే, దీని వల్ల జట్టు సభ్యులతో కెప్టెన్‌కు స్నేహం దెబ్బతినే పరిస్థితలు వస్తాయి. 

నేనైతే సెలక్షన్‌ గురించి ముందుగానే జట్టు సభ్యులతో చర్చించేవాడిని కాబట్టి.. మీడియా కంటే ముందే జట్టులో ఎవరున్నారన్న అంశంపై వాళ్లకు ఒక స్పష్టత వచ్చేది. కొత్త చీఫ్‌ సెలక్టర్‌ ఎవరైనా సరే.. క్రికెట్‌ ఆడే రోజుల్లో ఎంత గొప్ప ఆటగాడైనా సరే.. ఒక్కసారి పదవిలోకి వచ్చాక మీలోని సానుకూలతల కంటే కూడా ప్రతికూల విషయాల గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. 

గతంలో మీకున్న పేరుతో ఎవరికీ పనిలేదు’’ అని గావస్కర్‌ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ రేసులో మాజీ క్రికెటర్లు పార్థివ్‌ పటేల్‌, ప్రజ్ఞాన్‌ ఓజా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

చదవండి: అదే మా కొంప ముంచింది.. లేదంటే ఫలితంగా వేరుగా ఉండేది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement