source: BCCI X
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో తాను ఔట్ అయిన తీరు తరచూ గుర్తుకొస్తుందని చెప్పాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఓటమిని ఆ బాధతో పోల్చాడు.
విరాట్ మాటల్లో..
"2025 ఐపీఎల్ టైటిల్ గెలిచే వరకు 2016 సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభవం తరచూ గుర్తుకొచ్చేది. 2023 ప్రపంచకప్ ఫైనల్ విషయంలోనూ అదే అనుభూతి ఉంది. ఆ మ్యాచ్‌లో నేను జట్టును మంచి స్థితిలో ఉంచగలనని అనుకున్నా. కానీ నేను ఔట్ అయిన తీరు ఇప్పటికీ చాలా బాధిస్తుంది. చాలా రోజుల పాటు ఆ ఓటమి నుంచి బయటపడలేకపోయా"
2016 ఐపీఎల్ ఫైనల్‌తో పోలిక
2016 ఐపీఎల్‌లో ఆర్సీబీ అద్భుత క్రికెట్ ఆడుతూ ఫైనల్‌కు చేరింది. ఆ సీజన్‌లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేసి ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయంపాలై తొలి ఐపీఎల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ ఓటమి విరాట్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ఓటమిని విరాట్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాభవంతో పోల్చాడు.
2023 ప్రపంచకప్‌లోనూ భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. విరాట్ 765 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే టైటిల్ పోరులో భారత్ ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలై, మూడో వన్డే ప్రపంచకప్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఇదీ చదవండి: వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..!


