టీమిండియా కెప్టెన్ గిల్‌తో హోప్ (PC: BCCI/X)
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత గడ్డ మీద వన్డే మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. గత వైఫల్యాలను కొనసాగిస్తూ టీమిండియాతో ఆదివారం నాటి తొలి వన్డేలో కరేబియన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ మిడిలార్డర్ దానిని కొనసాగించలేకపోయింది.
టీమిండియా ఘన విజయం
ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి విండీస్ జట్టు 295 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆతిథ్య భారత్ 41.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. వెస్టిండీస్ బౌలింగ్ విభాగం కూడా తేలిపోవడంతో టీమిండియా ఈ మేరకు సునాయాస విజయం సాధించగలిగింది.
అలా చేస్తే ఫలితం వేరుగా ఉండేది
ఈ నేపథ్యంలో విండీస్ కెప్టెన్ షాయీ హోప్ తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ‘‘కచ్చితంగా మేము కాస్త భిన్నంగా ఆడి ఉండాల్సింది. మరిన్ని పరుగులు రాబట్టగలిగితే ఫలితం వేరేలా ఉండేది. భారత్‌లోని పిచ్‌లు బాగుంటాయి. ఇక్కడ మనం ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.
అదే తీవ్ర ప్రభావం చూపింది
నిజాయితీగా చెప్పాలంటే మేము 60- 80 పరుగులు వెనుకబడి ఉన్నాము. ఇక 290 పరుగుల మేర లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే గొప్పగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. మా బౌలర్లు కాస్త మెరుగ్గానే ఆరంభించారు. అయితే, మధ్య ఓవర్లలో ఓవర్‌కు ఏడు కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం కచ్చితంగా తీవ్ర ప్రభావం చూపింది.
ఫీల్డింగ్‌లో కూడా రెండు మూడు ఘోర తప్పిదాలు చేశాము. ఏదేమైనా మా ఓపెనింగ్ బ్యాటర్ల జోడీ మాత్రం అద్భుతంగా రాణించింది. వాళ్లు మాకు గొప్ప ఆరంభం అందించారు. భారీ స్కోరుకు పునాది వేసి.. మమ్మల్ని పోటీలో నిలిపారు. కానీ మిడిలార్డర్‌లో మాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, జాంగో పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ముందుగా చెప్పినట్లు మరిన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాము’’ అని షాయీ హోప్ పేర్కొన్నాడు. సమిష్టి వైఫల్యమే తమ కొంప ముంచిందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. కాగా తిరువనంతపురంలో టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
#KuldeepYadav makes an instant impact! 🔥
The partnership is broken and India have their first wicket!#INDvWI 1st ODI 👉 LIVE NOW 👉 https://t.co/zk2ABY21JG pic.twitter.com/w1tveUomaG— Star Sports (@StarSportsIndia) September 27, 2026
గ్రీవ్స్ శతకం
ఓపెనర్లలో జాన్ కాంప్‌బెల్ అర్ధ శతకం (60 బంతుల్లో 62) సాధించగా.. జస్టిన్ గ్రీవ్స్ (108 బంతుల్లో 101) శతక్కొట్టాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (31 బంతుల్లో 13) దారుణంగా విఫలం కాగా.. కెప్టెన్ షాయీ హోప్ (11 బంతుల్లో 12) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో నంబర్ బ్యాటర్ అమీర్ జాంగో 43 బంతుల్లో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.
బౌలర్లు విఫలం
ఇక విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 81 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. మిగిలిన వారిలో జేడన్ సీల్స్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఏడు ఓవర్లలో 32 పరుగులే ఇచ్చాడు.
అయితే, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కేసీ కార్టీ కేవలం నాలుగు బంతుల్లోనే 17 పరుగులు ఇచ్చుకున్నాడు. కాగా విండీస్ చివరగా 2021-22లో భారత్‌లో వన్డే సిరీస్ ఆడి.. టీమిండియా చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది.
చదవండి: గిల్- కోహ్లి శతక మోత!..మ్యాచ్ సాగిందిలా
ఇదీ చదవండి: అతడొక అద్భుతం..మ్యాచ్ నేనే ముగించాల్సింది: గిల్


