source: X
క్రికెట్ ఆస్ట్రేలియాలో తీవ్ర దుమారం చెలరేగింది. బిగ్‌బాష్ లీగ్ (BBL) ప్రైవేటీకరణ అంశంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ చైర్మన్ మైక్ బైర్డ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
బిగ్‌బాష్‌లోని మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకు తీసుకెళ్లడంపై క్రికెట్ న్యూ సౌత్‌వేల్స్ బైర్డ్‌కు మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
“చాలా ఆలోచించిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్‌ను CA బోర్డు సమర్థంగా ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను” అని బైర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అక్టోబర్ చివర్లో జరిగే క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక సమావేశం తర్వాత బైర్డ్ అధికారికంగా బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.
డేవిడ్ బూన్‌కు తాత్కాలిక బాధ్యతలు
మాజీ ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ డేవిడ్ బూన్‌ను తాత్కాలిక చైర్మన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఆటగాడిగా రిటైరైన తర్వాత బూన్ జాతీయ జట్టు సెలెక్టర్‌గా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పరిపాలకుడిగా పనిచేశారు.
బిగ్‌బాష్ ప్రైవేటీకరణపై వివాదం
క్రికెట్ ఆస్ట్రేలియా దేశీయ టీ20 క్రికెట్‌కు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఆర్థికంగా లీగ్‌ను మరింత బలోపేతం చేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం.
BBLలోని ఎనిమిది జట్లలో వాటాలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించే ప్రతిపాదనను ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చారు. అయితే క్రికెట్ నిర్వహణపై స్థానిక సంస్థల నియంత్రణ తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనలతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు.
విక్టోరియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టాస్మానియా క్రికెట్ సంఘాలు ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వగా, సౌత్ ఆస్ట్రేలియా కూడా పరిశీలించేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్‌లాండ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.
ఇదీ చదవండి: జగజ్జేతలను చిత్తు చేసిన బవుమా సేన


