వీడీసీఏ మాజీ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ భార్య, కోడలు మృతి
విశాఖ స్పోర్ట్స్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. బుధవారం (సెప్టెంబర్ 16) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) మాజీ సంయుక్త కార్యదర్శి జి.టి.ప్రసాద్ భార్య రమాదేవి (67), కోడలు నేహా బొమ్మలి (33) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రసాద్ కుటుంబంతో పాటు విశాఖ నగరంలో తీవ్ర విషాదం నింపింది. విశాఖలోని సీతమ్మధారలో నివాసముంటున్న జి.టి.ప్రసాద్ గతంలో షిప్‌యార్డ్ ఉద్యోగిగా, 2017 వరకు వీడీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
ఆయన కుమారుడు, కోడలు మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. కుమారుడి కుటుంబాన్ని చూడటంతో పాటు అక్కడ జరిగే ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు ప్రసాద్, రమాదేవి దంపతులు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. బుధవారం రాత్రి 9:40 గంటల సమయంలో మెల్‌బోర్న్ నైరుతి శివారు పాయింట్ కుక్‌లోని బోర్డ్‌వాక్ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫైల్ డ్రైవ్ జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పదిరోజుల్లో విశాఖకు మృతదేహాలు
వరుణ్‌చంద్ర గున్నా, నేహా దంపతులకు మూడున్నరేళ్ల కుమారుడు హారవ్, ఏడాది వయసున్న కుమార్తె వివాన్వి ఉన్నారు. ఇటీవలే వివాన్వి మొదటి పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించారు. రమాదేవి, నేహా మృతదేహాలు విశాఖ చేరుకోవడానికి కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేసి, బాధితులకు అండగా నిలిచేందుకు అక్కడి ఆస్ట్రేలియన్ తెలుగు కమ్యూనిటీ నిధులు సేకరిస్తోంది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా మృతి చెందడంపై వీడీసీఏ ప్రతినిధులు, విశాఖ క్రీడాకారులు తీవ్ర సంతాపం తెలిపారు.


