వైఎస్ జగన్‌తో వైఎస్సార్‌సీపీ నేతలు
వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక పరిస్థితులు వివరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్నా.. రైతులు, పశుపక్షాదులు విలవిల్లాడుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం పూర్తిగా పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యవసాయం అన్నా, రైతులు అన్నా ఇష్టం ఉండదని.. అందువల్లే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో సమీక్షించారు.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని వైఎస్ జగన్‌కు వివరించారు. ‘ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాభావంతో వేరుశనగ, కంది సహా పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులతో పంటల బీమా ప్రీమియం కట్టించుకుని, పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి.
ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించాలి. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లా గోరకల్లు రిజర్వాయర్‌లో నీరు ఉన్నా రైతుల పంటలకు నీరు విడుదల చేయడం లేదు. సర్కారు నిర్వాకం వల్ల నెల్లూరు జిల్లాలో రైతులకు రూ.1,500 కోట్ల నష్టం వాటిల్లింది. తిరుపతి వంటి ప్రధాన నగరానికి తాగునీరు అందించే పాపవినాశనం జలాశయంలోనూ నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
తాగునీటి భద్రతపై ఆందోళన పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లాలో దారుణ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి కూడా నీరు కరువైంది’ అని ఆయా జిల్లాల అధ్యక్షుడు ఉషాశ్రీచరణ్, అనంత వెంకట్రామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
లక్షలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి
‘కృష్ణా డెల్టాలో సుమారు 6 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం దాదాపు 50–55 వేల ఎకరాల్లో ఇప్పటికీ సాగు ప్రారంభం కాలేదు. పులిచింతలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు అందడం లేదు. గుంటూరు జిల్లాలో కేవలం 20 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే కరువు తప్పదు. గోదావరి జిల్లాల్లో ఆక్వా, పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత, విద్యుత్ కోత పెరిగింది. పొరుగు రాష్ట్రం నుంచి ఎరువులు కొనుక్కోవాల్సి వస్తోంది.
విశాఖలో తాగునీరు కూడా కరువైంది’ అని ఆయా జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, దేవినేని అవినాశ్, ధర్మాన కృష్ణదాసు, బెల్లాన చంద్రశేఖర్, కె.కె. రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, బొడ్డేడ ప్రసాద్, పరీక్షిత్ రాజులు వైఎస్ జగన్‌కు వివరించారు. అన్ని జిల్లాల సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించి పార్టీ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని విజయవంతంగా అమలు చేస్తామని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తెలిపారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుల పూర్తి ప్రసంగాలు epaper.sakshi.com లో


