ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అన్యాయం
ప్రభుత్వ కాలేజీల్లో రూ.26 వేలు.. ప్రైవేటులో కొన్ని చోట్ల రూ.2 వేలే!
పీజీలకు కూడా ప్రభుత్వ స్థాయిలో స్టైపెండ్ దక్కని దుస్థితి
అడ్మిషన్ సమయంలోనే విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న కొన్ని కాలేజీలు
ఓ మంత్రి కాలేజీలో హౌస్ సర్జన్స్‌కు స్టైపెండ్ నెలకు కేవలం రూ.2 వేలు
ఎన్‌ఎంసీ నిబంధనలు బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు
కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వైద్య విద్యార్థుల శ్రమ దోపిడీకి యథేచ్చగా పాల్పడుతున్నాయి. హౌస్ సర్జన్‌లు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్‌లు చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని విద్యార్థులతో సమానంగా ప్రైవేట్‌లో చదివే విద్యార్థులకు యాజమాన్యాలు స్టైపెండ్ ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లింపు విషయంలో నిబంధనలు అతిక్రమించడానికి వీల్లేదని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), న్యాయ స్థానాలు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ యాజమాన్యాలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. యాజమాన్యాలను నియంత్రించాల్సిన ఆరోగ్య విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం సైతం చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నాయి.
ఆ మంత్రి కళాశాలలో కేవలం రూ. రెండు వేలు
ప్రభుత్వ కళాశాలల్లో హౌస్ సర్జన్స్, పీజీ వైద్య విద్యార్థులతో సమానంగా ప్రైవేట్ కాలేజీల్లోను వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్స్‌కు స్టైపెండ్‌లు ఇవ్వాలని ఎన్‌ఎంసీ చెబుతోంది. ఇందుకు తగ్గట్టుగా గతంలోనే ప్రభుత్వంతో సమానంగా ప్రైవేట్ కళాశాలల్లో స్టైపెండ్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచి్చంది. రాష్ట్ర మొత్తం 21 ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నాయి. వీటిలో 4 వేల ఎంబీబీఎస్, వందల సంఖ్యలో పీజీ సీట్లున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో హౌస్ సర్జన్స్‌కు రూ. 26 వేల స్టైపెండ్ ఇస్తున్నారు.
పీజీ విద్యార్థులకు మొదటి ఏడాదికి రూ.60,823, రెండో ఏడాదిలో రూ.61,528, మూడో ఏడాదిలో రూ.64,767 చొప్పున నెలకు స్టైపెండ్ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని ఇప్పటికే జూనియర్ వైద్యులు సమ్మె కూడా చేశారు. ఇదే తరహాలో స్టైపెండ్ విధానాన్ని ప్రైవేట్‌లోను అమలు చేయాల్సి ఉండగా ఏ ఒక్క కాలేజీలోనూ అమలు కావడం లేదు. చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేస్తున్న ఓ సీనియర్ మంత్రికి చెందిన వైద్య కళాశాలలో హౌస్ సర్జన్స్‌కు కేవలం రూ.2 వేలు చొప్పున స్టైపెండ్ ఇస్తున్నారు. మరికొన్ని కళాశాలల్లో నెలకు రూ.3 వేలు, రూ.4 వేలు ఇలా రూ.10 వేల లోపే స్టైపెండ్ అందిస్తున్నారు. ఇక పీజీ విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ఇస్తున్న స్టైపెండ్స్‌లో సగం కూడా ప్రైవేట్‌లో దక్కడం లేదు.
ముందే తల్లిదండ్రుల నుంచి వసూళ్లు
స్టైపెండ్ చెల్లింపుల్లో కొన్ని ప్రైవేట్ కాలేజీలు మాయ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంబీబీఎస్ విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలోనే కొంత మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి యాజమాన్యాలు డిపాజిట్ చేయించుకుంటున్నాయి. ఇలా చెల్లించిన మొత్తం నుంచే హౌస్ సర్జెన్సీ సమయంలో విద్యార్థులకు స్టైపెండ్ రూపంలో బ్యాంక్ ఖాతాల్లో కొన్ని కాలేజీలు జమ చేస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో స్టైపెండ్ చెల్లించినట్టు రికార్డుల్లో చూపించడం కోసం విద్యార్థుల ఖాతాలకు నగదు బదిలీ చేసి, గంటల వ్యవధిలోనే ఆ డబ్బును విత్‌డ్రా చేయించి వెనక్కి లాగేసుకుంటున్న పరిస్థితి ఉంటోంది.
ప్రశ్ని స్తే వేధింపులు
స్టైపెండ్‌తో పాటు, కళాశాలల్లో వసతులు, ఇతర సమస్యలపై ప్రశ్ని స్తే ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నాయి.
ప్రశ్ని ంచిన విద్యార్థులను టార్గెట్ చేసి ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేయడం, నో–అబ్జెక్షన్ సర్జిఫికెట్ ఇవ్వబోమని నేరుగా హెచ్‌వోడీల ద్వారా బెదిరింపులకు దిగుతున్నాయి. అందువల్లే యాజమాన్యాలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రాల బాధ్యతే అని తేల్చి చెప్పినా ...
వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లింపుల అమలు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ ఇప్పటికే ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తమ పరిధిలోని వైద్య కళాశాలల్లో విద్యార్థులకు స్టైపెండ్‌లు సహా, ఇతర సమస్యల పరిష్కారం విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని అన్ని ఆరోగ్య విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాల వైద్య శాఖలకు ఎన్‌ఎంసీ పలు మార్లు స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఆరోగ్య విశ్వవిద్యాలయం గానీ అసలు పట్టించుకోవడం లేదు. కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి, యాజమాన్యాలను అదుపుచేయాల్సిన బాధ్యత వర్సిటీపై ఉంది. ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి
ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు స్టైపెండ్ అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. కాలేజీల్లో క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయం తనిఖీలు చేయడం, స్టైపెండ్ చెల్లింపులపై ఆడిట్ నిర్వహించడం చేయాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్టైపెండ్ విషయంలో అవకతవకలకు పాల్పడితే అనుమతులు సైతం రద్దు చేసేలా ఎన్‌ఎంసీ నిబంధనలున్నాయి.
– డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్


